- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ బిగ్ డెసిషన్: రూ.1,000 కోట్లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో రానున్న వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధమవుతోంది. నైరుతీ రుతుపవనాల రాక, వర్ష సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రానున్న వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధమవుతోంది. నైరుతీ రుతుపవనాల రాక, వర్ష సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. వర్షాకాల సన్నద్ధత, ముందస్తు చర్యలపై సీఎం అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ కీలక సమావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోం శాఖల మంత్రులతో పాటు.. హైడ్రా (HYDRAA), విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో వాతావరణ శాఖ అధికారులు ఎల్ నినో ప్రభావం, ఈ ఏడాది కురిసే నైరుతి రుతుపవనాల వర్షపాతం, ఇతర వాతావరణ మార్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి మరియు అధికారులకు వివరించారు.
పంట మార్పిడిపై ఫోకస్..
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు విస్తృతంగా అవేగాహన కల్పించాలని ఆదేశించారు. తక్కువ నీటి వినియోగంతో పండే ప్రత్యామ్నాయ పంటల గురించి అన్నదాతలకు వివరించాలన్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పంట మార్పిడి (Crop Rotation), పంటల వైవిధ్యత (Crop Diversification) ప్రాధాన్యతను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల మరమ్మతులు, మెయింటెనెన్సుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలో గతంలో దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల (బ్రిడ్జీల) పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
విపత్తు నిర్వహణకు రూ.1000 కోట్లు సిద్ధం..
రాబోయే వానాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం, తక్షణ అవసరాల కోసం వినియోగించాలని స్పష్టం చేశారు. "విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలి. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.






