రాఘవ కన్ స్ట్రక్షన్స్ సహా అన్ని మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీఐడీ విచారణకు ఆదేశం

by Prasad Jukanti |   (  Updated:2026-03-28 14:30:05  IST  )

తెలంగాణలో 2014 జూన్ 2 నుంచి జరిగిన అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రాఘవ కన్ స్ట్రక్షన్స్ సహా అన్ని  మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీఐడీ విచారణకు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి అదేశించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సహా అన్నిటిపై విచారణజరుపుతామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' అక్రమ మైనింగ్‌‍కు పాల్పడుతోందని దీనిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరును మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ తో పాటు బీఆర్ఎస్ నేతలు గంగుల, వద్దిరాజు మైనింగ్‌, సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ చేయిస్తామన్నారు. సంతోశ్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణకు ఆదేశిస్తున్నామని విచారణ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశంలో సభ ముందు ఉంచుతామన్నారు. అక్రమ మైనింగ్‌కు హరీష్, కేటీఆర్ నాయకత్వం వహించారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బ్లాక్‌ మెయిల్స్‌కు భయపడేది లేదన్నారు.

హరీశ్ రావు అడ్డగోలు దోపిడీ

మైనింగ్ శాఖ తొలుత హరీశ్ రావు వద్ద ఉండేదని ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఈ విషయంలో కొడుకు, అల్లుడి మధ్య పంచాయతీ పడితే దీనికి పరిష్కారంగా కేసీఆర్ ఆ శాఖను అల్లుడి వద్ద నుంచి తీసేసి కొడుకు కేటీఆర్‍కు అప్పగించారని అన్నారు. వారి దోపిడీని నిలువరించి మైనింగ్, ఇసుకలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచామని ఈ విషయం ప్రజలకు అర్థం అవుతోందని గ్రహించే బీఆర్ఎస్ నేతలు తమకు లొంగని మంత్రులపై ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు జల్లే బురదకు ఇక్కడ మేము భయపడమన్నారు. కేటీఆర్ ఆస్తి తగాదాల వల్ల తన సొంత చెల్లి కవితను ఇంట్లో నుంచి, పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి బంధువులకు వ్యాపారాలు ఉంటే పొంగులేటికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. పొంగులేటిని బెదిరించి లొంగదీసుకోవాలనే ప్రయత్నం దిక్కుమాలిన చర్య అన్నారు. మంత్రులను బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటే ఇలాంటి పప్పులు ఉడకవన్నారు. సీఐడీ విచారణ ద్వారా నిజాలు బయటకు తీసి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు.

తెలంగాణ వచ్చాక క్రీడా స్ఫూర్తి తగ్గింది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

Next Story