- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medigadda: ప్రతీదీ టెక్నికల్‌గా రికార్డ్ చేయండి: ఇరిగేషన్ అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించారు. కుంగిపోయిన పిల్లర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, పునరుద్ధరణ పనుల తీరుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజీ పునాది (Raft) పరిస్థితిని అంచనా వేసేందుకు జరుగుతున్న డ్రిల్లింగ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. సుమారు 500 బోర్లు వేసి సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) చేయాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో, ఆ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రిల్లింగ్ ద్వారా వెలువడుతున్న సమాచారాన్ని నిశితంగా విశ్లేషించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న ప్రతీ చిన్న పనిని, పరిశీలనను సాంకేతికంగా (Technically) రికార్డ్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇవి కీలక ఆధారాలుగా మారుతాయని పేర్కొన్నారు.
వరదలకు ముందే డిజైన్లు..
వర్షాకాలం ప్రారంభమై గోదావరికి వరదలు వచ్చేలోపే సాయిల్ టెస్టింగ్, రిపేర్ డిజైన్లను పూర్తి చేయాలని గడువు విధించారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ (NDSA) నిపుణులు ఇచ్చిన సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాలని, భద్రతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పిల్లర్లు కుంగడానికి గల లోతైన కారణాలు, పునాదిలో తలెత్తిన సమస్యలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడకు మేడిగడ్డ అత్యంత కీలకమని, దీన్ని మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు పకడ్బందీ ప్రణాళికతో పని చేయాలని అధికారులను ఉత్సాహపరిచారు. ఈ పర్యటనలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ పరిశీలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నస్తూర్‌పల్లిలో జరగనున్న బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.






