- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ సంస్థలకు రేవంత్ సర్కార్ వార్నింగ్!
కార్పొరేట్ సంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని నిర్ణయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద వచ్చిన ఫండ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, వాటి టర్నోవర్, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే.. చాలా తక్కువగా నిధులు వచ్చాయని గుర్తించినట్లు సమాచారం. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి దేశవ్యాప్తంగా 2021–22లో రూ.27,141 కోట్లు, 2022–23లో రూ.30,932 కోట్లు, 2023–24లో రూ.34,908 కోట్లు ఖర్చు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఈ ఖర్చు 2021–22లో రూ.688 కోట్లు, 2022–23లో రూ.1,040 కోట్లు, 2023–24 లో రూ.1,054 కోట్లుగా ఉంది. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ విరాళాల వాటా రాష్ట్రంలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని గుర్తించారు. ఇప్పటివరకు వచ్చిన సీఎస్ఆర్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో లేవని, తెలంగాణలో కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎస్ఆర్ ఫండ్స్ వేరే చోట ఖర్చు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో సీరియస్‌గానే చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎస్ఆర్ నిధులపై ఇటీవల సీఎం రేవంత్ సమీక్షించారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణతో పాటు సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ ఫండ్స్ వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు తెలంగాణలోనే ఎక్కువ సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేలా విధంగా చూడనున్నారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో సీఎస్ఆర్ నిధుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు.
దాతలకు సన్మానం.. ప్రత్యేక సెల్
కొత్త సీఎస్ఆర్ పాలసీలో కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధానాలను అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ఇతర కార్యక్రమాలను చేపట్టే కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం తరఫున సన్మానించాలని, అభినందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ అభినందన ఉత్సవానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా నిధుల కోసం ప్రత్యేకంగా సీఎస్ఆర్ సెల్, ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ ఫండ్స్‌తో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలను సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్రస్థాయి సెల్ నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేకంగా సీఎస్ఆర్ పోర్టల్ రూపొందించనున్నారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ విరాళాలను ఇచ్చేందుకు, వివిధ విభాగాల పరిధిలో చేపట్టేందుకు వీలున్న ప్రాజెక్టుల వివరాలన్నీ ఈ పోర్టల్‌లో పొందుపరుస్తారు. కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, తమకు అనువైన ప్రాజెక్టులను ఎంచుకునేందుకు వీలుగా ఈ పోర్టల్ ఆకర్షణీయంగా తయారు చేయనున్నారు.






