ఉద్యోగాలు కావాలంటే క్రీడల్లో రాణించండి : రాష్ట్ర యువతకు సీఎం రేవంత్ పిలుపు

by Naga Rani Yarlagadda |

గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలో ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించలేదని, హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించాలన్నది తన జీవిత కల అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉద్యోగాలు కావాలంటే క్రీడల్లో రాణించండి : రాష్ట్ర యువతకు సీఎం రేవంత్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలో ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించలేదని, హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించాలన్నది తన జీవిత కల అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ను పీటీ ఉషతో కలిసి ప్రారంభించారు. అలాగే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీని కూడా ప్రారంభించి, స్పోర్ట్స్ వర్సిటీ వెబ్ సైట్, లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రన్నర్ గా పీటీ ఉష మనందరికీ మంచి స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. 2036లో భారత్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వనుందని, అందుకు హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడంలో భారత్ ఎప్పుడూ చివరనే ఉంటోందన్న సీఎం.. కొందరు ఒలింపిక్స్, ఇతర గేమ్స్ లో రాణించినా దేశానికి సరైన గుర్తింపు రావడం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేసే విధానాలే స్పోర్ట్స్ లో దేశం ఈ దుస్థితిలో ఉండటానికి ప్రధాన కారణమని సీఎం రేవంత్ ఆరోపించారు. అందుకే క్రీడాకారుల్ని సరైన దిశలో నడిపించేందుకే స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే చదువు ఒక్కటే కాదని, క్రీడల్లో రాణించి, దేశానికి పేరు తీసుకువస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నారు. క్రీడలపై దృష్టి పెట్టి, క్రీడాకారులుగా రాణించినవారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందన్నారు.

అనంతరం రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన పలువురు పారా అథ్లెట్, తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి నగదు బహుమతులు అందజేసి సన్మానించారు. పారా అథ్లెట్ అయిన దీప్తి జీవాంజికి రూ.50 లక్షల బహుమతి అందజేశారు. ధనుష్ శ్రీకాంత్ కు రూ.2.10 కోట్లు, ఈషా సింగ్ కు రూ.3.30 కోట్లు, నిఖత్ జరీన్ కు రూ.60 లక్షలు, తనీష్క్ మురళీధర్ కు రూ.53 లక్షల 60 వేలు, సురభి భరద్వాజ్ కు రూ.10 లక్షల నగదు బహుమతులు అందించారు.

Next Story