ఇది దేశంపైనే దాడి.. ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

by Ramesh Naini |

హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP), సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇది దేశంపైనే దాడి.. ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Haryana) హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP), సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ (Puran Kumar) ఆత్మహత్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్, ఒక ఐపీఎస్ అధికారి కూడా కుల వివక్షకు గురై ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, సమాజంలో కుల ఆధారిత ద్వేషం ఎంత పెరిగిందో చూపిస్తున్న దారుణ ఉదాహరణ అని పేర్కొన్నారు.

‘ADGP స్థాయి అధికారి కూడా వేధింపులకు గురైతే, సాధారణ ప్రజల పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థమవుతుంది’ అని సీఎం తెలిపారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ఇవి రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సామాజిక చైతన్యం అవసరమని వివరించారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అందరూ తీవ్రంగా ఖండించాలని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

‘ఇది కేవలం ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్‌పై దాడి కాదు.. దేశంపైనే దాడి.. ఇలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వై. పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ‘వ్యక్తి సామాన్యుడైనా, ఉన్నతస్థాయి అధికారి అయినా, దళిత వర్గానికి చెందిన వారైనా, అన్యాయం, అమానవీయత ఏ రూపంలోనైనా సహించరాదు’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

Next Story