- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అనుకునేలోపే కుప్పకూలింది: సీఎం రేవంత్
ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్దనున్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు(JCRDLIS)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్దనున్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు(JCRDLIS)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయరంగు పులుముకుందని చెప్పారు. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదమే ఉండేది కాదని తెలిపారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులకు, భూసేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఏర్పడింది. అయినా కఠిన పరిస్థితులు అన్నీ అధిగమించి వచ్చే రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రూ.6 వేల కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టు ఇవాళ రూ.18 వేల కోట్లు అవసరమైన స్థితికి చేరుకున్నది. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తెలంగాణలోని ప్రతీ ఎకరాకు నీరందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో అత్యధికంగా వరి దిగుబడి
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినప్పుడు పరిస్థితి బాగానే ఉండింది. నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ నేతల స్వార్థ రాజకీయంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కమీషన్ల కోసం ఒకే ఒక్క ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చుచేసి.. మొత్తం రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు గొప్పది అనుకునేలోపే కుప్పకూలింది. కాళేశ్వరం కింద నీరు ఎత్తిపోయనప్పటికీ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి వస్తోంది. కృష్ణా జలాల తరలింపుపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో సుదీర్ఘంగా చర్చించాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను, పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాం. కేసీఆర్, హరీష్ రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించారు. అన్ని మొట్టికాయలు వేసేలా మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నేతలకు సవాల్..
ఇప్పుడు మళ్లీ సవాల్ చేస్తున్నాను. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారేం చేశారో.. రెండున్నరేళ్లలో మేమేం చేశారో సభలోనే చర్చిద్దాం. ఎవరేం చేశారో నిండు సభలో ప్రజలకు వివరిద్దాం. విమర్శలు, ప్రతి విమర్శలు వద్దు అనుకున్నా ఓకే. పదేళ్ల అనుభవంతో వాళ్లు సలహాలు, సూచనలు చేస్తే స్వీకరిస్తాం. అంతిమంగా అందరం కలిసి రాష్ట్రానికి మేలు చేసేలా కృషి చేద్దాం. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం. ప్రజలు, తెలంగాణ నీళ్ల విషయంలో అందరం కలిసిగట్టుగా ఉందాం. కృష్ణా జలాల విషయంలో తాము ఏపీకి సహకరిస్తున్నామనేది పచ్చి అబద్ధం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.






