- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి రాముడిపై సీఎం రేవంత్ రెడ్డి ఆన.. రాష్ట్రంలో మరోసారి రాజకీయ ప్రకంపనలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'రైతు ఆశీర్వాద సభ'కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'రైతు ఆశీర్వాద సభ'కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదిక నుంచి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులు రూ.1009 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రూ.8,759 కోట్ల పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లయింది. ఇప్పటిదాకా 74 లక్షల మంది రైతులకు చెందిన 1.45 కోట్ల ఎకరాల భూములకు విజయవంతంగా పెట్టుబడి సాయం అందించామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.
నా రాజకీయ ఎదుగుదలకు ఖమ్మమే గుండెకాయ..
సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. "నా రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా ఒక గుండెకాయలాగా నిలిచింది. 2023 జులైలో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. నాటి బీఆర్ఎస్ అహంకార పాలనను కాదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆనాడు ఉప్పెనలా జనం కాంగ్రెస్ వైపు వచ్చారు. సరిగ్గా 36 నెలల తర్వాత మళ్లీ అదే జులైలో ఇవాళ ప్రజాపాలనను ఆశీర్వదించడానికి రైతాంగం మళ్లీ ఉప్పెనలా తరలివచ్చింది" అని హర్షం వ్యక్తం చేశారు. "తెలంగాణలో బీఆర్ఎస్‌ను మళ్లీ మొలకెత్తనీయబోమని ఇక్కడి ప్రజలు ఒట్టు పెట్టారు. అందుకే ఆ పాపాల భైరవుడిని ఫాంహౌస్‌లో బంధించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయమాటలు, మూటలతో వస్తున్నారని, వారిని ఎలా ఎదుర్కొంటావని కొందరు నన్ను అడిగారు. వాళ్లు ఎలా వచ్చినా కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని ఆనాడే గంటాపథంగా చెప్పా. మేము అన్నట్టే ఎన్నికల్లో 64 సీట్లు సాధించాం. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు గెలిచి మా బలాన్ని నిరూపించుకున్నాం" అని గుర్తుచేశారు.
భద్రాచలం రాముడిపై ఆన.. 2029లో 117 సీట్లతో మళ్లీ మనదే పీఠం!
భవిష్యత్తు ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం రాముడి సాక్షిగా సంచలన ప్రతిన పూనారు. "2029 జూన్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు 25కు, అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయి. ఆ 182 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 సీట్లు గెలిచి, రెండోసారి సగర్వంగా ప్రజాపాలనను తీసుకొస్తుంది. భద్రాచలం రాముడీ మీద ఆన వేసి చెబుతున్నా.. ఇది కేవలం నా మాట కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పూనిన ప్రతిన" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






