కేటీఆర్ విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్‌లా ఉన్నాయి : CM రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-09 07:40:35  IST  )

బీఆర్ఎస్ నేత కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కేటీఆర్ విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్‌లా ఉన్నాయి : CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదన్నారు. పదేళ్ల పాలనలో రాష్ర్టంలో ఒక్క ఉద్యోగం కూడా రాని సచివాలయం, కంట్రోల్ రూమ్ లను కట్టారని, వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరిపై నిఘా కోసం, ఎవరి వాస్తుకోసం వాటిని నిర్మించారు? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఆయన దశ, దిశ సరిగ్గా లేనప్పుడు వాస్తు మారిస్తే ఏమొస్తుందన్నారు. ఆయన కొడుకు జీవితంలో అయితే ఆ రేఖ లేనే లేదన్నారు.

సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని రేవంత్ అన్నారు. సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకుంటాడా? అనిప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్ రెడ్డి.. గుజరాత్ కు గులాంగిరీ చేస్తూ.. తనపై ఒంటికాలిపై లేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఎగిరితే ఏమీ రాదని, ఏమన్నా ఉంటే మోదీ దగ్గర మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో తామేం చేయలేదని విమర్శిస్తున్నారన్న సీఎం.. కులగణన చేయలేదా? ఎస్సీ వర్గీకరణ చేయలేదా?మహిళలకు ఉచిత బస్సు ఇవ్వలేదా? రేషన్ కార్డులివ్వలేదా? యంగ్ ఇండియా, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురాలేదా? సన్నబియ్యం ఇవ్వలేదా? రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ ధృతరాష్ట్రుడు కళ్లకు గంతలు కట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం లేకపోయినా 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా? కనీసం వీసీలను నియమించలేదన్నారు. 5 వేల పాఠశాలలు మూసేశారని తెలిపారు. పేదలకు విద్య, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారని దుయ్యబట్టారు. 1 లక్షా 87 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని కట్టలేదు. టిమ్స్ లు పూర్తి చేయలేదన్నారు.

తమ ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశామన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామన్నారు. రూ.3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. "100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నాం. పాత పథకాలను కొనసాగిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం. తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం. కేసీఆర్ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశాం. 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశాం. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండి. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ప్రాధాన్యత వారీగా సమస్యలను పరిష్కరిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవాల్సిందే.. అభివృద్ధి జరగాల్సిందే.." అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ లో 100 శాతం కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు.

Next Story