తార్నాకలో బడాబాబులకే రూల్స్ వర్తింపవా ?

by Batti.Sumithra |

హైదరాబాద్ నగరంలోనే అత్యంత కీలకమైన జంక్షన్లలో ఒకటైన తార్నాక ఇప్పుడు అక్రమఆక్రమణలు, అడ్డగోలు పార్కింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

తార్నాకలో బడాబాబులకే రూల్స్ వర్తింపవా ?
X

దిశ, సికింద్రాబాద్ : హైదరాబాద్ నగరంలోనే అత్యంత కీలకమైన జంక్షన్లలో ఒకటైన తార్నాక ఇప్పుడు అక్రమఆక్రమణలు, అడ్డగోలు పార్కింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారి పై ప్రయాణించాలంటేనే సామాన్య వాహనదారులు వణికిపోతున్నారు. అయితే, ఈ సమస్యలను పరిష్కరించాల్సిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు చూపిస్తున్న వివక్ష, పక్షపాత వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గల్లీల్లో గరీబోళ్ల పై ప్రతాపం.. మెయిన్ రోడ్డు పై ఎందుకు మౌనం ?

ఇటీవల పలువురు గల్లీల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. ట్రాఫిక్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. రోడ్డు పక్కన బండి పెట్టుకుని పొట్టకూటి కోసం వెతుక్కునే గరీబోళ్లను లక్ష్యంగా చేసుకుని, వారి సామాగ్రిని, స్టీల్ బండ్లను బలవంతంగా వ్యాన్లలో వేసుకుని వెళ్లారు. గల్లీల్లో అంత వేగంగా 'యాక్షన్' తీసుకున్న పోలీసులు.. నిత్యం నగరంలోనే ప్రధాన కూడలిగా ఉంటూ, వేలాది మంది ప్రయాణించే తార్నాక చౌరస్తా మెయిన్ రోడ్డు పై జరుగుతున్న ఘోరమైన ఆక్రమణల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు సూటిగా నిలదీస్తున్నారు. గరీబోడికి రాజకీయ బలగంగానీ, అధికారులను మేనేజ్ చేసే ఆర్థిక స్తోమత గానీ ఉండదు కాబట్టే వారిని 'ఈజీ టార్గెట్' చేశారని జనం మండిపడుతున్నారు.

తాజాకిచెన్' కోసం యూటర్న్ బలి.. ఫుట్‌పాత్ కూడా కబ్జా !

తార్నాక నుంచి లాలాపేట వెళ్లే మార్గంలో ఉన్న 'తాజా కిచెన్' హోటల్ దగ్గర ట్రాఫిక్ నిత్యం స్తంభించిపోతోంది. గతంలో ఇక్కడ యూటర్న్ ఉన్న సమయంలో వాహనాల రాకపోకలు చాలా సాఫీగా సాగేవి. కానీ, ఇప్పుడు ఆ యూటర్న్‌ను మూసివేయడం వెనుక ట్రాఫిక్ పోలీసుల హస్తం ఉందనే సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కేవలం తాజా కిచెన్ హోటల్‌కు వచ్చే కస్టమర్ల కార్ల పార్కింగ్ కోసమే పోలీసులు లాలూచీ పడి ఆ యూటర్న్‌ను మూసేశారని వాహనదారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. యూటర్న్ క్లోజ్ చేసినప్పటి నుంచి హోటల్ ముందు ఒకదాని వెనుక ఒకటిగా కార్లను లైన్ కట్టి రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు, సదరు హోటల్ యాజమాన్యం సామాన్య ప్రజలు నడిచే ఫుట్‌పాత్‌ను సైతం ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం కబ్జా చేసింది. నడవడానికి వీల్లేకుండా ఫుట్‌పాత్‌ను బైకులతో నింపేస్తున్నా, కార్లను రోడ్డు పై పెడుతున్నా పోలీసులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

రాత్రి 9 దాటితే డెక్కన్ ప్లాజా అరాచకాలు..

తాజా కిచెన్‌కు కొద్ది దూరంలోనే ఉన్న 'డెక్కన్ ప్లాజా' వద్ద పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాత్రి 9 గంటలు దాటిందంటే చాలు, ఈ హోటల్ నిర్వాహకుల అక్రమాలు మొదలవుతాయి. కస్టమర్ల బైక్‌లను ఏకంగా ప్రధాన రహదారిపైకి వచ్చేలా, సగానికి పైగా రోడ్డును ఆక్రమించేలా పార్కింగ్ చేయిస్తున్నారు. రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు ఈ అడ్డగోలు పార్కింగ్ వల్ల తీవ్రఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రిపూట ట్రాఫిక్ నిఘా తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని డెక్కన్ ప్లాజా యాజమాన్యం చేస్తున్న ఈ నిర్వాకం పై ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు.

బ్లైండ్ స్పాట్‌గా మారిన చౌరస్తా యూటర్న్.. ఆటోల వల్ల నిత్యం ప్రమాదాలు !

మరోవైపు తార్నాక చౌరస్తా దగ్గర ఉన్న యూటర్న్ వద్ద ఆటో డ్రైవర్ల అరాచకం హద్దులు దాటుతోంది. లాలాపేట్ నుంచి తార్నాక వచ్చి, మళ్లీ యూటర్న్ తీసుకుని వెళ్లే ప్రధాన కూడలిని కొందరు ఆటో డ్రైవర్లు అక్రమంగా 'ఆటో స్టాండ్'గా మార్చేశారు. అక్కడ అసలు ఆటో స్టాండే లేకపోయినా.. వరుసగా ఆటోలను లైన్‌గా నిలిపి ఉంచడం వల్ల, పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకుని రోడ్డుపైకి వచ్చే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు అస్సలు కనిపించడం లేదు. ఈ బ్లైండ్ స్పాట్ కారణంగా నిత్యం వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నా.. అక్కడే ఉండే ట్రాఫిక్ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

బోర్డైనా పెట్టండి.. లేదంటే చర్యలైనా తీసుకోండి..

ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే ఇంత అరాచకం జరుగుతున్నా పట్టించుకోకపోవడం పై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. "ఒకవేళ ఇది అధికారిక ఆటో స్టాండ్ అయితే.. ఇక్కడ 'ఆటో స్టాండ్' అని ఒక బోర్డైనా పెట్టండి, లేదంటే అక్రమంగా రోడ్డును బ్లాక్ చేస్తున్న ఆటోల పై కఠిన చర్యలు తీసుకోండి" అని వాహనదారులు పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు. పేదవ్యాపారుల బండ్లను లాక్కెళ్లడంలో చూపే శ్రద్ధను, కార్పొరేట్ హోటళ్ల ముందర, అక్రమ ఆటో స్టాండ్ల దగ్గర ఎందుకు చూపడం లేదు ? ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, తార్నాక ట్రాఫిక్ పోలీసుల పక్షపాత వైఖరి పై విచారణ జరిపి, మెయిన్ రోడ్డు పై ఉన్న ఆక్రమణలను తొలగించి సామాన్య వాహనదారుల ఇబ్బందులను తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story