పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు: సీఎం రేవంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, సినీ కార్మికులను, నిర్మాతలను కూడా తమ ప్రభుత్వం కాపాడుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు.

పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, సినీ కార్మికులను, నిర్మాతలను కూడా తమ ప్రభుత్వం కాపాడుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని ఆయన కోరారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమన్నారు. సినీ చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి సినీ నిర్మాతలు, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. సినీ రంగానికి సంబంధించిన పలు సమస్యలను సీఎం దగ్గర వారు ప్రస్తావించారు. ఆదివారం సాయంత్రం జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు కలిశారు. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలని, సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని, ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్​ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని, తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని, తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ అని, పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని ఆయన అన్నారు. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమన్నారు. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుందని, సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని, పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని అన్నారు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని, పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానని, హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమా ల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని ఆయన కోరారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే తన ధ్యేయమన్నారు. ఈ భేటిలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు లు ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని,వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ,గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము లు ఉన్నారు. వీరితో పాటుగా . సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులున్నారు.

Next Story