"నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. నా పేరు మార్చుకుంటా" : సీఎం రేవంత్ బిగ్ చాలెంజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-05 14:27:24  IST  )

బీఆర్ఎస్ పదేళ్ల పాలన, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి బిగ్ చాలెంజ్ చేశారు. కేసీఆర్ దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.

నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. నా పేరు మార్చుకుంటా : సీఎం రేవంత్ బిగ్ చాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఒక మేకవన్నిన పులి అని.. ఆ విషయం పాలమూరు ప్రజలకు తెలియక నాడు ఓట్లేసి రెండుసార్లు గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించిన అనంతరం.. ఉదండపూర్ లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా.. ఐదుసార్లు కూడా పాలమూరుకు రాలేదన్నారు. తాను కూడా పాలమూరు జిల్లాలోని మిడ్జిల్ నుంచే మొదట జడ్పీటీసీగా గెలిచానని.. నాటి జడ్పీటీసీనే.. నేడు సీఎంగా జిల్లా ప్రజల ముందున్నానని, పాలమూరు జిల్లాలోని సమస్యలన్నింటినీ తీరుస్తానని మాటిచ్చారు. కేసీఆర్ ఇక్కడ కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయిందని, ఇక ఏం చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలను నమ్మరన్నారు. బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు కాదు కదా.. ఇక్కడి నుంచి కాశీ వరకూ పొర్లుదండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తీరవన్నారు.

కేసీఆర్.. దమ్ముంటే చర్చకు రా

పాలమూరు నుంచి గెలిచి.. ఇక్కడి నుంచి పారిపోయిన కేసీఆర్ ద్రోహి అవుతారా ? లేక పాలమూరు అభివృద్ధికోసం సీఎంగా కృషి చేస్తున్న తాను ద్రోహినవుతానా? ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు, మనవడు రాజ్యమేలడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదన్నారు. లాల్చి వేసుకున్నోడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు.. గడ్డం పెంచుకున్నోడు భగత్ సింగ్ కాదు.. పంచకట్టుకున్నోడు వైఎస్సార్ కాలేడన్నారు. పంచలు కట్టుకుని ఉదండపూర్ కు పాదయాత్రకు వస్తే తొండలు విడిచి కొడతారన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు లక్ష కోట్లకు పైగా ఖర్చుచేసిన కేసీఆర్.. ఉదండపూర్ ముంపు బాధితులకు మాత్రం రూ.800 కోట్లు ఇవ్వకుండా జైల్లో పెట్టించి కొట్టించారని ఆరోపించారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారని, పాలమూరులో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వమన్నారు. గద్దెలు కూలాలి.. బీఆర్ఎస్ జెండాలు దిగాలని ప్రజలకు పిలుపున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై తాము చర్చకు సిద్ధమని.."నీ పేరు కేసీఆర్ అయితే.. దమ్ముంటే చర్చకు రా" అని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు. చర్చలో ఓడిపోతే తాను ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు ఇళ్లు కట్టిన చోట ఓట్లు అడగాలని, తాను ఇందిరమ్మ ఇళ్లు కట్టినచోట ఓట్లు అడుగుతానని.. బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు వస్తే నా పేరు మార్చుకుంటా అని బిగ్ చాలెంజ్ చేశారు. తాడూ, బొంగరం లేని ఇద్దరు నేతలను తమపైకి వదిలారని, వాళ్లతో చెప్పించుకునే పరిస్థితిలో తాములేమని సీఎం రేవంత్ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. 2034 వరకూ తమదే అధికారమని.. కేసీఆర్ కు చేతనైతే తమ గెలుపును అడ్డుకోవాలని మరో సవాల్ చేశారు. 2029లో గెలుపెవరిదో తేల్చుకుందామన్నారు.

Next Story