రైతన్నలకు ఇచ్చినట్టే.. నేతన్నలకు ప్రాధాన్యం ఇస్తాం : పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్​రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఇచ్చినట్టే.. నేతన్నలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు.

రైతన్నలకు ఇచ్చినట్టే.. నేతన్నలకు ప్రాధాన్యం ఇస్తాం : పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఇచ్చినట్టే.. నేతన్నలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. పద్మశాలీలు ఆర్ధికంగా, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందేలా క్రియశీల నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో అఖిల భారత పద్మశాలీ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, తెలంగాణ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్​చైర్మన్​ఈరవత్రి అనిల్​కుమార్, అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, గౌరవ అధ్యక్షులు సుంకర్​వార్, జనరల్​సెక్రటరీ గడ్డం జగన్నాథం, తెలంగాణ అధ్యక్షులు కమర్తపు మురళీ, ప్రధాన కార్యదర్శి మాచర్ల రాంచంద్రరావు, కోశాధికారి దేవందర్, షోలాపూర్​ఎమ్మెల్యే కోటి దేవేందర్, ఏపీ ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, పి.అనురాధ, వరంగల్​మేయర్​గుండు సుధారాణి, ఐఏఎస్​నరహారి హాజరుకాగా సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య​అతిథిగా విచ్చేశారు.

ఈసందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్​ప్రభుత్వం మీది.. మీ సొదరుడు తెలంగాణ రాష్ట్రాని ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. మీకు కావాల్సిన పనులన్నీ చెప్పి చేయించుకోండి.. చేయించుకోకపోతే మీ తప్పు అవుతుంది. నా తప్పు కాదు.. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం.. నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేనెప్పుడు వెనుక అడుగు వేయను”అని సీఎం అన్నారు. ‘‘ కష్టమోచ్చిన.. నష్టమోచ్చిన, ఇబ్బందులు వచ్చిన, నిలబడి ఎదుర్కొన్న.. మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చిన్నవయసులోనే నాకొచ్చింది. నాకు ఏచీకు చింత లేదు.. ఏ వ్యసనాలు లేవు.. అవసరాలు లేవు.. నాకున్నదల్ల నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏమైన చేయాలన్న తపన, నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వారి బిడ్డగా ఆదుకోవాలన్న ఆలోచనతో తప్ప ఇంకోటి లేదు’ అని సీఎం పేర్కొన్నారు. ‘మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుని,. మీకోసం నిరాంతరం పనిచేస్తాను..మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా.. మీమల్ని ఏవిధంగా ఆదుకోవాలో ప్రణాళికలు తీసుకోని రండి.. ప్రభుత్వంలో ఆమోదింపజేసే బాధ్యత నాది’’ సీఎం అన్నారు.

ఆత్మగౌరమే కాదు.. త్యాగంలోనూ ముందుంటారు..

పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ కూడా ముందుంటారన్నారు. ఇందుకు ఉదాహరణ కొండా లక్ష్మణ్​బాపూజీ గారు.. అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్​బాపూజీ తన పదవిని సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. అనాటి ఉద్యమకారులు ప్రజానాయకులు,, నాయకులు.. ..ప్రజా ప్రతినిధులు అయ్యారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారారని, వాళ్లందరూ రాజకీయ ప్రయోజనం పొందితే,. ఒకే ఒక్కడు.. కొండా లక్ష్మణ్​బాపుజీ ఉన్న శాసన సభ సభ్యత్వానికే కాదు.. మంత్రి పదవి కూడా రాజీనామా చేశారని సీఎం పేర్కొన్నారు. మళ్లీ ఏదైనా బాధ్యత చేపట్టాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలని పదవి త్యాగదం చేశారని, ఆయన బతికి ఉన్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా ఈ దేశంలోనే త్యాగానికి మారుపేరుగా కొండా బాపుజీ ఆదర్శంగా నిలిచారని రేవంత్​రెడ్డి కొనియాడారు. జలదృశ్యంలో అనాడు తెలంగాణ ఉద్యమం చేయాలని రాజకీయ పార్టీ పెడితే ఎవ్వరూ నిలువ నీడ కూడా ఇవ్వలేదు.

కానీ త్యాగానికి మారుపేరైనా కొండా బాపుజీ నెక్లస్​రోడ్డుపై సచివాలయం ఎదురుగా జల దృశ్యంలో దశాబ్దలుగా నివసిస్తున్న ఆయన సొంత ఇంట్లోనే అందర్నీ సాదారంగా ఆహ్వనించి రాజకీయ పార్టీకి పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీయే అని సీఎం గుర్తు చేశారు. దాంతో అనాటి పాలకులు ఆయనకు నిలువ నీడ లేకుండా చేసినా కొండా లక్ష్మన్​బాపూజీ భయపలేదని, తెలంగాణ ప్రజల కోసం సర్వం త్యాగం చేసి, ముందు వరుసలో నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీయేనని అన్నారు. కానీ దురదృష్టం ఆయన మరణించినప్పుడు, ఆయన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న గత పాలకులు చివరి చూపు చూడడానికి దగ్గరకు రాలేదని, కనీసం నివాళులర్పించకపోవడాన్ని పద్మశాలీ సమాజం మరిచిపోలేదని సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆలె నరేంద్రను కేసీఆర్ ​ఖతం చేసిండు..

తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ సాధన సమితి పేరుమీద టైగర్​ నరేంద్ర మలి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. ఆయన అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ సాధన జరిగితే పద్మశాలీలకు కీర్తి ప్రతిష్టలు, గొప్ప పేరు వస్తుందని, ఆయనను కేసీఆర్​తన పార్టీలో కలుపుకున్నాడన్నారు. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే, ధృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయన్ని ఖతం చేసిన కథ పద్మశాలీలకు గుర్తు చేయదలుచుకున్ననని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్​నిర్మాణంలో పద్మశాలీల పాత్ర ఎంతగాఉందంటే.. జోలె పట్టుకుని సిరిసిల్లకు వస్తే ఓట్లు..నోట్లు వేసింది పద్మశాలీలు కదా అని సీఎం పేర్కొన్నారు. ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు. రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో పద్మశాలీలు కదా అని ఈ సందర్భంగా గుర్తు చేయదలచుకున్నానని అని సీఎం అన్నారు. ఏ సందర్భం వచ్చిన , ఏ అవకాశం వచ్చిన ఒక రాజకీయ పార్టీని, నాయకులను ఆ కుటుంబాన్ని పద్మశాలీ సొదరులు ఆదరించారన్నారు.

గత పాలకులు నేతన్నలు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు బకాయిలు పెట్టి తమ ప్రభుత్వాన్ని అప్పజెప్పడం జరిగిందన్నారు. ఏ అవకాశం వచ్చిన పద్మశాలీలను ఆదుకోవాలని, వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలని, ఆర్ధికంగా నిలబెట్టాలని, ఆత్మగౌరవంతో బతికేలా ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలన్నదే కాంగ్రెస్​ప్రభుత్వం విధానం అని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్)తెలంగాణ రాష్ట్రానికి లేదు. పదేండ్లు పాలించిన ఆనాటి ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నం చేయలేదని, దాంతో చదువుకోవాలంటే విద్యార్థులు బెంగళూరుకో.. లేదా ఇంకా ఎక్కడనో ఉన్న ఇనిస్టిట్యూట్ ​వెళ్లాల్సి వచ్చేదని సీఎం తెలిపారు. తాను సీఎం అయిన వెంటనే పద్మశాలీలు గుర్తు చేస్తే కేంద్రంతో మాట్లాడి ఐఐహెచ్​ను సాధించడమే కాదు.. దానికి కొండా లక్ష్మణ్​బాపుజీ పేరు పెట్టి ఆయన గౌరవాన్ని , పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కాంగ్రెస్​నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

ఆసీఫాబాద్​ మెడికల్​ కాలేజీకి కొండా పేరు..

వాస్తవానికి ఆదిలాబాద్​ జిల్లాకు సంబంధించిన ఆయన నల్లగొండ జిల్లాలో ప్రజాప్రతినిధి రాణించి, తెలంగాణ రాష్ట సాధనలో ఒక ఆదర్శ మూర్తిగా కొండా బాపూజీ నిలిచారని సీఎం తెలిపారు. ఆసిఫాబాద్​ మెడికల్​కాలేజీకి ఆయన పేరు పెడుతామని సీఎం ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చే వరకు ఆ బాధ్యతలను తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు సీఎం సూచించారు. పద్మశాలీల బకాయిలు, విద్యుత్తు బిల్లులు కావోచ్చు.. ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పు తనకు దృష్టికి వచ్చినప్పుడు వెంటవెంటనే వాటి పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు.

600 కోట్ల పెట్టుబడితో చీరెల అర్డర్​..

గత పాలకులు మహిళలకు అందించిన బతుకమ్మ చీరెలు తీసుకెళ్లి పోలాల గట్లట్లో పిట్టలను బెదరగొట్టెందుకు కట్టడం తప్పా ఆడబిడ్డలు కట్టుకున్న సందర్భం లేదని సీఎం విమర్శించారు. కానీ నేతన్నల వృత్తి దెబ్బతింటుంది.. వాళ్లకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది.. ఈ ప్రభుత్వంలో ఆపితే అప్రతిష్ట పాలు అవుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఈరవత్రి అనిల్, ప్రిన్సిపాల్​సెక్రటరీ తమ దృష్టి తీసుకురావడం జరిగిందన్నారు. ఆనాడు బతుకమ్మ చీరెలకు 200 నుంచి 250 రూపాయలు ఖర్చుపెడి నేడు మహిళా స్వయం సహాయక సంఘాలతో 600 కోట్ల పెట్టుబడి పెట్టి విలువైన కోటి 30 లక్షల చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని చెప్పారు. కరెంటు బిల్లులు, బతుకమ్మ చీరెల బకాయిలు, వేములవాడలో లాండ్, అలాగే, నేతన్నలకు సంబంధించిన బకాయిలను ఇన్సురెన్స్​అన్నింటినీ కూడా గత అగస్టులోనే సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందని సీఎం ఈసందర్భంగా వివరించారు.

బీసీలకు న్యాయం చేయాలనే కుల గణన..

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చామని, ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. ఆ కుట్రదారులను తిప్పికొట్టేందుకు శక్తి, యుక్తిని ప్రదర్శించి తనకు అండగా నిలబడాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి చూపిస్తామన్నారు. మా లెక్కలపై బీఆర్​ఎస్, బీజేపీలు విమర్శలు చేయడం కాదని, ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపాలని అసెంబ్లీలో సవాల్​ విసిరితే తొకముడిచారని సీఎం పేర్కొన్నారు. ప్రధానిమోడీ మెడపై కత్తిలా వేలాడుతుందనే.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పుంటున్నాయని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే, తమ లెక్కలో ఉన్నత కులాలు 15.28 శాతం మాత్రమే అని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.

షోలాపూర్ లో మార్కండేయ భవనం..

మహారాష్ట్రలోని షోలాపూర్లో పద్మశాలీలు చాలా మంది ఉన్నారని, అక్కడ పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.కోటి ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ‘మీ సోదరుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మీకు కావాల్సిన పనులు చేయిం చుకోండి అని సూచించారు. మీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలతో రండి.. వాటిని ఆమోదించే బాధ్యత తనదని’ ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

Next Story