- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.1.95 లక్షల బోనస్.. లాభాల్లో 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఒక్కో కార్మికునికి బోనస్‌గా రూ. 1,95,610 చెల్లిస్తామని సర్కారు వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా సందర్భంగా (Singareni workers) సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఒక్కో కార్మికునికి బోనస్‌గా రూ. 1,95,610 చెల్లిస్తామని సర్కారు వెల్లడించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాల్లో సింగరేణి ఉద్యోగులకు 34శాతం లాభాల వాటా బోనస్ చెల్లిస్తున్నట్లు వారు ప్రకటించారు. సింగరేణి నికర లాభాలను ప్రకటిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం లాభాల వాటాను వెల్లడించారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల రూపాయల నికర లాభాలు సాధించగా, దీనిలో సింగరేణి సంస్థ చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం రూ. 4,034 కోట్లను కేటాయించామని, మిగిలిన రూ.2,360 కోట్ల నికర లాభాల్లో 34 శాతం సొమ్ము అనగా రూ. 819 కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్ గా ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగరేణిలోని సుమారు 41,000 మంది కార్మికులకు 34శాతం లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.1,95,610 వరకు లభిస్తాయని సీఎం వెల్లడించారు.
గత ఏడాదితో పోల్చితే సగటున ఒక్కో ఉద్యోగికి 4.4 శాతం అదనంగా రూ.8,289 మేర లాభాల బోనస్ లభిస్తుందన్నారు. గత ఏడాది సగటున ఒక్కో కార్మికుడి రూ.1,87,321 లాభాల బోనస్ చెల్లించగా.. ఈ సారి పెంచినట్లుగా తెలిపారు. రెగ్యులర్ కార్మికులు కాకుండా సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఈ ఏడాది రూ.5,500 బోనస్ ను కూడా ప్రకటించారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి చరిత్రలో తొలిసారిగా రూ. 5వేల బోనస్ ను తమ ప్రభుత్వం చెల్లించగా.. ఈ సారి రూ. 500 పెంపుదల చేసినట్లు తెలిపారు. దసరా పండును కార్మికులు ఉత్సాహంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సింగరేణిని కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని కోరారు. బోనస్ తాము అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు, ఆ ప్రాంత ఎమ్మెల్యేల ఒత్తిడి వల్లే సాధ్యమైందన్నారు. ఇప్పుడు దసరా బోనస్ ఇస్తున్నామని... కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి కార్మికులకు అందిస్తామని సీఎం ప్రకటించారు.
రాష్ట్రంలోని గనులన్నీ సింగరేణికి దక్కేలా చూస్తాం
రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే చెందే విధంగా ప్రత్యేక చొరవ చూపనున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టెండర్లలో పాల్గొనకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు వేలం ద్వారా కైవసం చేసుకున్న సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాకులను కూడా తిరిగి సింగరేణికి అప్పగించేందుకు కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటు సంస్థలకు దీటుగా పనిచేయాలని, ఓపెన్ మార్కెట్లో ఇతరులు తక్కువ ధరకు బొగ్గు అమ్ముతుంటే, సింగరేణి సంస్థ కూడా తక్కువ ధరకే బొగ్గు అమ్మే స్థాయికి ఎదగాలని సూచించారు. దేశానికి వెలుగులు ఇస్తున్న సింగరేణి సంస్థను మరింతగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టెండర్లలో సింగరేణి పాల్గొనకపోతే ప్రైవేటు సంస్థలకు లాభాలు అప్పనంగా అప్పగించినట్లు అవుతుందని కార్మిక నాయకులతో చర్చల సందర్భంగా తెలియచేశామని అన్నారు. ఆ గనులను సింగరేణి కైవసం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కార్మికులు కోరారని తెలిపారు. అవసరమైతే ఆ ప్రైవేటు వ్యక్తులు వేసిన టెండర్లకు అదనంగా చెల్లించి అయినా వాటిని కైవసం చేసుకుంటామని అన్నారు.
సింగరేణికి విద్యుత్ సంస్థల బకాయిలు
ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన క్రాస్ సబ్సిడీలు పెండింగులో ఉన్నాయని, ఈ రెండు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం తెలిపారు. ధరలు పెంచేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. బ్యాంకు లోన్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవడం, ట్రాన్స్ మిషన్ లాసెస్ తగ్గించుకోవడం, సింగరేణి, విద్యుత్ శాఖలకు ఉన్న బకాయిలను క్రాస్ సబ్సిడీ అందించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. టాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన ఆదాయ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలన్నారు.
జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ నష్టం రూ.7 వేలను కేంద్రం భర్తీ చేయాలి
కొత్త జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ అమలు వల్ల తెలంగాణకు భారీ ఆదాయ నష్టం వాటిల్లనుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ రాష్ట్ర ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నాకు. దాంతో తెలంగాణకు రూ.7,000 కోట్ల వరకు నష్టం కలుగుతుందని తెలిపారు. ఈ నష్టాన్ని భరించేందుకు రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలన్నారు. జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ కారణంగా తెలంగాణకు కలిగే ఆదాయ లోటును భర్తీ చేయాలని మేము కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కేంద్రం ఉన్న ఫళంగా జీఎస్టీ సవరించడం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి తెలత్తుందని అన్నారు. జీఎస్టీ నిర్ణయాలు తీసుకుని అలాగే వదిలేస్తే రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దీనిపై తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిఫ్యూటీ సీఎం లేఖ రాస్తారని తెలిపారు.
క్రిటికల్ మినర్స్ లో సింగరేణి సత్తా చాటాలి -డిఫ్యూటీ సీఎం భట్టి
సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొని కొత్త బ్లాకులు సాధించాలని, క్రిటికల్ మినరల్స్ రంగంలో బ్లాకులు చేపట్టి అభివృద్ధిలో ముందుకు సాగాలని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్ కోసం సింగరేణి పెద్ద ఎత్తున విస్తరించాలని సూచించారు. ఇప్పటికే కర్ణాటకలోని రాయచూరులో రాగి, బంగారు గనుల వేలంలో సింగరేణి విజయవంతమైందన్నారు. సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు నిధులు అవసరమై ఉంటాయని కాబట్టి సాధించిన నికర లాభాల్లో సుమారు రూ.4,034 కోట్లను కొత్త ప్రాజెక్టుల కోసం కేటాయించామని తెలిపారు. సింగరేణి కార్మికులు సింగరేణి అభివృద్ధికి సహకారం అందించాలని, కార్మిక సంఘాలు కూడా సహకరించాలని ఆయన పేర్కొన్నారు. లాభాలు పంపిణీ చేసే ప్రక్రియలో సహకరించిన కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సహా మిగతా సంఘాలన్నింటికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
త్వరలో కొత్త బొగ్గు బ్లాక్ లు సాధిస్తాం -సింగరేణి సీఎండీ ఎన్ బలరాం
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి ఒడిశాలో నైని బ్లాకును సాధించిందని, క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించిందని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు త్వరలోనే కొత్త బొగ్గు బ్లాక్ లను వేలం పాట మార్గం ద్వారా సాధిస్తుందన్నారు.






