మూసీ పునరుజ్జీవం పనులకు CM రేవంత్ శ్రీకారం.. గోదావరి డ్రికింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-08 11:40:42  IST  )

మూసీ పునరుజ్జీవం (Musi Revival) పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు.

మూసీ పునరుజ్జీవం పనులకు CM రేవంత్ శ్రీకారం.. గోదావరి డ్రికింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవం (Musi Revival) పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇవాళ ఆయన గండిపేట్‌ (Gandipet)లో రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టబోయే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ప్రాజెక్టు (Godavari Drinking Water Scheme Project) ఫేజ్-2,3 పనులకు శంకుస్థాపన చేశారు. ఉస్మాన్‌ సాగర్‌ (Osman Sagar), హిమాయత్‌ సాగర్‌ (Himayath Sagar) చెరువులను మంచినీటితో నింపాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2లోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 15 కొత్త రిజర్మాయర్లను కూడా సీఎం ప్రారంభించనుున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెడుతుండగా.. కాంట్రాక్టు సంస్థ 60 శాతం నిధులను సమకూర్చుకోనుంది. ఈ మొత్తం పనులు ప్రారంభించిన నుంచి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. దీంతో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను నింపనున్నారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలకు వినియెగించనున్నారు. నీటి తరలింపులో భాగంగా నగరంలో ఉన్న 7 చెరువులను కూడా అదే నీటితో నింపనున్నారు. 2027 డిసెంబరు నాటికి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతిరోజూ నల్లా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును సర్కార్ చేపడుతుండటం విశేషం. కాగా, సీఎం రేవంత్ రెడ్డి అంతకు ముందు కోకాపేట‌లోని నియోపోలిస్‌ ట్రంపెట్‌ జంక్షన్‌ను ప్రారంభించారు.

Next Story