‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-19 08:24:27  IST  )

నాగర్ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం అమ్రాబాద్ మండలం మాచారం చేరుకున్నారు.

‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌
X

దిశ, వెబ్‌డెస్క్/అచ్చంపేట: నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం అమ్రాబాద్ మండలంలోని మాచారం చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో బీడు వారుతున్న పోడు భూములకు జల‌కళను తెచ్చేందుకే సర్కార్ ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

రాబోయే ఐదేళ్లలో 2.10 లక్షల ఎకరాల పోడు భూముల్లో సాగుకు వంద శాతం సబ్సిడీతో సోలార్ పంప్‌ సెట్లను అందజేయనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా బలంగా చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం వర్తించనుంది. గిరిజన రైతుకు 2 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే.. సమీప రైతులను కలిపి బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేయనున్నారు.

గిరిజనులతో సీఎం ముఖాముఖి..

‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గం మొత్తంలో వ్యవసాయానికి కరెంట్ పంప్ సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని ఇందుకు ఒక్క రూపాయి కూడా రైతులు చెల్లించాల్సిన పని లేదని అన్నారు. వ్యవసాయం కోసం సౌర విద్యుత్ ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా అదనంగా వచ్చే సోలార్ విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మాలని ఆయన సూచించారు. గిరిజన రైతులు ఒకే పంట మీద ఆధారపడొద్దని.. వివిధ రకాల పంటలను సాగు చేయాలన్నారు. అప్పుడే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సోలార్ పంపు సెట్ల ఏర్పాటులో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు 5 లేదా 7.5 హెచ్‌పీ పంపు సెట్లు ఇస్తామన్నారు.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇన్నాళ్లు విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు విద్యుత్ శాఖతో గిరిజన రైతులకు తీవ్ర ఇబ్బందులు ఉండేవని.. ఇకనుంచి ఎవరికీ ఆ సమస్య ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. రైతుల చెంతకే కరెంట్ వచ్చిందని కామెంట్ చేశారు. ఇచ్చిన సోలార్ ప్యానళ్లను భద్రంగా కాపాడుకోవాలని, పంపులకు సరిపోయే విద్యుత్‌తో పాటు మిగిలిన విద్యుత్‌ను తిరిగి ప్రభుత్వానికి అమ్ముకుంటే నెలకు రూ.2 వేలు, రూ.3 వేలు ఆదాయం వస్తుందన్నారు. ప్రస్తుతం ఇస్తున్న సోలార్ ప్యానళ్లతో పాటు అదనంగా మరికొన్ని పానళ్లను ఇవ్వాలని అధికారులను సూచించానని తెలిపారు. మిగులు సౌర విద్యుత్‌‌ కొనుగోలుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చివర్లో అక్కడున్న మహిళలు పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించగా.. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేది ఉందని.. అవి రాగానే అందరి ఖాతాల్లో జమ చేస్తామని సమాధానమిచ్చారు.

Next Story