- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగభద్రలో మన నీటి వాటాకు సీఎం రేవంత్ తూట్లు: కవిత
తుంగభద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టుల్లో తెలంగాణ నీటి వాటాను కాపాడాలని సీఎం రేవంత్‌ను కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించారు

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి ముఖ్యమంత్రి రేవంత్ మద్దతు ఇస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆర్డీఎస్ చుట్టు కర్ణాటక చేపట్టే ప్రాజెక్ట్ లతో మనం నీటి హక్కును కోల్పోతామని మన హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లవద్దన్నారు. అందుకు బదులుగా సెంట్రల్ వాటర్ కమిషన్ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయవద్దన్నారు.
నాడు కేసీఆర్ నేడు రేవంత్:
తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదని, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నడిగడ్డను బతికించి...ఉమ్మడి మహబూబ్ నగర్‍కు ఉపయోగపడే ప్రాజెక్ట్ అన్నారు. ఆర్డీఎస్‍లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదన్నారు. మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. మనకు ఆర్డీఎస్‍లో 16 టీఎంసీలు వచ్చినట్లే ఏపీకి సుంకేశుల నుంచి 16 టీఎంసీల వాటా ఉంది. కానీ వాళ్లు దాన్ని 32 టీఎంసీలు చేసుకోని బీభత్సంగా నీటిని వాడుకుంటున్నారు. మనం మాత్రం ఆ పనిచేయలేదు. మనం మౌలిక సదుపాయాలు ప్రాజెక్ట్ లు కట్టుకునే లోపే కర్ణాటక తుంగభద్ర మీద మూడు ప్రాజెక్ట్ లు కడుతోంది. కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తోంది. ఆర్డీఎస్ కు 15 కి.మీ.ల ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మిస్తోంది. ఆర్డీఎస్‍కు దిగువన రాయచూరు జిల్లాలోని చిక్క మంచాల సమీపంలో 5 టీఎంసీల కెపాసిటీతో మరో బ్యారేజి నిర్మిస్తోందన్నారు. మొత్తంగా ఆర్డీఎస్ కు ఎగువన, దిగువ 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతోందన్నారు.
శాశ్వతంగా మన హక్కులు కోల్పోయే ప్రమాదం:
వాస్తవానికి కర్ణాటకకు ఆర్డీఎస్ లో 1.20 వాటా నీళ్లు మాత్రమే ఉన్నాయని కానీ పది టీఎంసీల నీళ్లు వినియోగించుకునే ప్రయత్న చేస్తోందన్నారు. అలాంటి కార్యక్రమానికి మన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబు, డీకే శివకుమార్‍లను కూర్చొబెట్టుకోని మనకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే తుంగభద్రలో మన వాటా హక్కును పర్మినెంట్‍గా కోల్పోతామన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లొద్దు. బదులుగా ప్రొటెస్ట్ రూపంలో ఒక లేఖ రాయాలని సూచించారు. మళ్లీ మీరు అధికారంలోకి రారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్యలు తీసుకుంటే మీ ముఖ్యమంత్రే మా ప్రాజెక్ట్ లకు అంగీకారం తెలిపారని కర్ణాటక వాదిస్తుందన్నారు.
ఏపీ, కర్ణాటక సీఎంలతో ఆ మాట చెప్పించండి:
మీరు చేసే ఈ పని నడిగడ్డ ప్రజలకు అతిపెద్ద గుదిబండగా మారుతుందని అందుకే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అందరం కలిసి కేంద్రంతో మన నీటి వాటా హక్కుల కోసం పోరాడుదామని కృష్ణా, తుంగభద్రలో మన వాటాను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి శాశ్వతంగా తాగు, సాగు నీరు వచ్చేలా చేసుకుందామని, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాను కాపాడుకోవాలంటే మీరు ఆ కార్యక్రమానికి వెళ్లవద్దన్నారు. ఒకవేళ వెళితే అదే స్టేజీ మీద బనకచర్ల కట్టమని ఏపీ సీఎంతో, ఈ మూడు ప్రాజెక్ట్ లు రద్దు చేసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పించాలన్నారు. అంతేగానీ తెలంగాణ నీటి హక్కును కోల్పోయే ప్రమాదకరమైన పనికి మద్దతివ్వొద్దన్నారు.






