ప్రధానితో సీఎం రేవంత్‌ కీలక భేటీ.. మెట్రోకు నిధులు, ‘పాలమూరు’ క్లియరెన్స్‌పై చర్చ

by Kema Shiva Kumar |

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ప్రధానితో సీఎం రేవంత్‌ కీలక భేటీ.. మెట్రోకు నిధులు, ‘పాలమూరు’ క్లియరెన్స్‌పై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘నీతి ఆయోగ్’ (Niti Aayog) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

రీజినల్ రింగ్ రోడ్డు, 12 లేన్ ఎక్స్‌ప్రెస్ వే..

తెలంగాణ రవాణా రంగానికి, పారిశ్రామిక వృద్ధికి ఊతమిచ్చే రీజినల్ రింగ్‌రోడ్డు (RRR) పనుల పురోగతిని సీఎం రేవంత్ ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన కేంద్ర నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు వరకు ప్రతిపాదించిన అత్యంత కీలకమైన 12 లేన్ ఎక్స్‌ప్రెస్ వే (12-lane Expressway) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులు, మూసీ ప్రక్షాళన

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ పనులకు కేంద్ర వాటాను, అవసరమైన నిధులను మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే, హైదరాబాద్‌ నగర రూపురేఖలను మార్చేలా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన (Musi Riverfront Project) కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని పీఎంకు రిక్వెస్ట్ చేశారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన జైపాల్ రెడ్డి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) సంబంధించి కేంద్ర జల సంఘం (Central Water Commission - CWC) నుంచి త్వరగా క్లియరెన్స్ ఇప్పించాలని రేవంత్ రెడ్డి, పీఎం మోడీని కోరినట్లుగా తెలుస్తోంది.

Next Story