- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు : జీవన్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు.

- రైతుల సమస్యలపై రేవంత్ ఒక్క రివ్యూ చేయలేదు
- ధాన్యం కొనుగోళ్లు లేక రైతులకు నష్టం
- కేబినెట్‌లోనూ ఈ అంశంపై చర్చించలేదు
- బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం వరి ధాన్యం కొనుగోలు అని.. కానీ, ఇంతటి ప్రాధాన్యత అంశాన్ని కేబినెట్‌లో చర్చించలేదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అందాల పోటీల నిర్వహణ, ఫుట్ బాల్ పోటీల నిర్వహణకే సరిపోయారని.. రైతుల సమస్యలపై ఇంతవరకు ఒక్క రివ్యూ చేయలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చెయ్యండని రైతులు వేడుకుంటున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు లేక ప్రైవేటుకు అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. క్వింటాల్‌కు రూ.250 పోతుండగా.. దానిని ఆర్ఆర్ ట్యాక్స్‌గా పరిగణించాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఘోరంగా మోసం చేస్తున్నదని ఆరోపించారు. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ మోసం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు పంటకు పంటకు వస్తుండేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇచ్చే దిక్కులేదని అన్నారు. ఎండ తీవ్రతకు ధ్యానం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతున్నారని.. 50 శాతం ధాన్యం కల్లాల్లోనే ఉన్నదని చెప్పారు.
ఇక.. మొక్కజొన్న కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ పేరుతో మభ్య పెడుతున్నారని హరీశ్‌రావు అంటే మంత్రి శ్రీధర్‌బాబు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. ఫార్మా సిటీ భూములను రేవంత్‌రెడ్డి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని తెలిపారు. సీఎం, మంత్రి ఉత్తమ్ స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని.. కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏనాడూ కరీంనగర్ రాలేదని.. ధాన్యం కొనుగోలుపై రివ్యూ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అంటున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల పెడితే తెలుస్తుందని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు ఎదురుస్తున్నారని తెలిపారు. మే 31లోపు ధాన్యం కొనుగోలు చేయకుంటే జూన్ 2న జెండా ఆవిష్కరణ చేసే నైతికత రేవంత్‌రెడ్డికి లేనేలేదన్నారు.






