దావోస్‌లో రెండో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

by Yella Dhawani Reddy |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీమ్ మంగళవారం రెండో రోజు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్నారు.

దావోస్‌లో రెండో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీమ్ మంగళవారం రెండో రోజు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF)లో పాల్గొని, కేంద్ర మంత్రులతో కలిసి గ్రాండ్ ఇండియా పావిలియన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో అనేక రంగాలు దూసుకెళ్తున్నాయనీ, బయోటెక్నాలజీ, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని పారిశ్రామిక వేత్తలకు వివరించి, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అలాగే, తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భారత ప్రభుత్వ లక్ష్యమైన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరుపనున్నారు. పరిశ్రమలు పెట్టే వారికి అందించే ప్రోత్సాహకాలు గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అన్ని రకాల అనుమతులను వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయాన్ని సదరు పారిశ్రామిక దిగ్గజాలకు తెలియజేయనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక సీఎం బృందం రెండో రోజు సమావేశాల తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల గురించి స్పష్టత రానుంది.

Next Story