- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: బీసీ రిజర్వేషన్ల పెంపే లక్ష్యంగా ‘చలో ఢిల్లీ’.. సీఎం రేవంత్ బిగ్ స్కెచ్
బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మార్చి పదో తేదీన చలో ఢిల్లీకి పిలుపునివ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు జంతర్ మంతర్ వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దీక్ష చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ దీక్షా వేదిక నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్లాన్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని చేర్చింది. అందులో భాగంగా ప్రభుత్వం కులగణన చేయడంతో పాటు, బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో సిఫారసు చేసేందుకు డెడికేటెడ్ కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం తీర్పు ఉండటంతో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే బీసీలకు రిజర్వేషన్లను పెంచవచ్చు. ఆ అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హస్తినకు వెళ్లి, బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం దీక్ష చేయనున్నట్లు తెలుస్తున్నది.
కలిసి రావాలని అన్ని పార్టీలకు అప్పీలు
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు ఆహ్వానిస్తూ అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం రేవంత్ స్వయంగా లేఖలు రాయనున్నట్టు తెలిసింది. విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ దీక్షకు హాజరైతే.. కేంద్రంపై ఒత్తిడి పెరిగి, బీసీలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు. ఢిల్లీ దీక్షకు ఏయే రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. కానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు వెళ్లే చాన్స్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆలోచన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారనుంది. ఒకవేళ ఢిల్లీ దీక్షకు వెళ్తే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని బీజేపీ నుంచి విమర్శలు, వెళ్లకపోతే బీసీ వ్యతిరేకి అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ప్రమాదముంది.
పార్లమెంట్ లోపల రాహుల్ ఒత్తిడి
మార్చి పదో తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజున సభలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రస్తావించనున్నారు. దేశంలో జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని రాష్ట్రానికి చెందిన కీలక నేతలు పేర్కొన్నారు.
ఈలోపే సర్వేకు చట్టబద్ధత
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న రీ సర్వే ఈ నెల 28న ముగియనుంది. వెంటనే వర్గాల వారీగా జనాభా వివరాలను ప్రకటించి, కేబినెట్ ఆమోదించనుంది. ఆ సర్వేకు చట్టబద్దత కల్పించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, చట్టం చేయనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపైనా చట్టం చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మార్చి పదో తేదీ లోపు కంప్లీట్ అవుతుందని, ఈ లోపు రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ సైతం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.






