మెట్రో, ఆర్ఆర్ఆర్‌పై ఫోకస్ .. నిధులకోసం ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్రం వాటాగా రూ.4230 కోట్లు కేటాయించి, అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

మెట్రో, ఆర్ఆర్ఆర్‌పై ఫోకస్ .. నిధులకోసం ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్రం వాటాగా రూ.4230 కోట్లు కేటాయించి, అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి పలు అంశాలను ప్ర‌ధాన‌మంత్రి మోడీ దృష్టికి తీసుకవెళ్లారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను త‌క్ష‌ణం విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉందని, గత పదేళ్లలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి విస్తరణ చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకవచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-II విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, ఫేజ్-IIలో 5 కారిడార్లు 76.4 కి.మీ. ఉంటుందని, ఇది కేంద్రం రాష్ట్రం కలిసి చేప‌ట్టాల్సిన ప్రాజెక్ట్ (జేవీ ప్రాజెక్ట్) అన్నారు. దీనికి కేంద్రం నుంచి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.

గతంలో 2024 అక్టోబ‌రులో చెన్నై మెట్రో ఫేజ్‌-IIకు (రూ. 63,246 కోట్లు), 2021, ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-II (రూ. 14,788 కోట్లు), 2024, ఆగ‌స్టులో బెంగ‌ళూర్ మెట్రో ఫేజ్-IIIకు (రూ. 15,611 కోట్లు) ఆమోదం తెలిపారని సీఎం రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోడి కి గుర్తు చేశారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2025, నవంబరు 4న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు స‌మ‌ర్పించిందన్నారు. వాటిపై కేంద్రం కొన్ని వివరణలు కోరగా, వాటికి సమాధానాలు ఇచ్చామన్నారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెల‌పాలని కోరారు.

ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR)

హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్‌) తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం: సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ (ఎన్‌హెచ్ 161) ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం: చౌటుప్పల్ – అమన్‌గల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి (ఎన్‌హెచ్ 65) ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం: భూముల సేకరణకు 2022లో ప్రారంభమైంది. భూ సేక‌ర‌ణ వ్యయంలో రాష్ట్రం 50 శాతం భరిస్తోంది. 90% భూముల ప్రపోజల్స్ ఎన్ హెచ్ఏఐకి పంపాం. ఎన్‌హెచ్ఏఐ టెండ‌ర్లు పిలిచింది. ఈ భాగానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక, కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు ఈ భాగాన్ని ఏక కాలంలో చేప‌ట్టాలని ప్రధాని నరేంద్రమోడీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఇప్పుడున్న ఓఆర్ఆర్ రానున్న ఐదేళ్లలో సరిపోదని, ఇప్ప‌టికే ఓఆర్ఆర్ పై రోజుకు ల‌క్ష సీపీయూ ఉందన్నారు. ఆర్ఆర్ ఆర్ ఉత్త‌ర భాగం పూర్త‌యిన త‌ర్వాత ద‌క్షిణ భాగం నిర్మాణం చేప‌డితే భూ సేక‌ర‌ణ‌, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్ర‌మాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువ‌ల్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తేనే సరైన ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రింగ్ రైల్వే ప్రాజెక్ట్..

రీజిన‌ల్ రింగు రోడ్డుకు స‌మాంత‌రంగా 370 కిమీ పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించామని, ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుందని, బందరు పోర్టు నుంచి హైద‌రాబాద్ డ్రైపోర్ట్ వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ దేశంలో 35 శాతం ఔషధాలు ఉత్పత్తి చేస్తోందని, బందరు పోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే స‌ర‌కు రవాణా ఖర్చు తగ్గించ‌డంతో పాటు ఎగుమతులకు ద‌న్నుగా నిలుస్తుందన్నారు. ఈ మార్గం త‌యారీ రంగానికి ప్రోత్సాహ‌కంగా ఉండ‌డంతో పాటు నూత‌న ఉద్యోగాల‌ను సృష్టిస్తుందన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఏఎండీ, క్వాల్కం, నివిడియా వంటి ఆర్అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని, పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైద‌రాబాద్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ ఐఎస్ఎం, ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెల‌పాలని, ఇది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని క‌లిగించి ఉద్యోగాలు సృష్టిస్తుందన్నారు. 2030 నాటికి ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తిలో 500 బిలియ‌న్ డాల‌ర్లకు చేరుకోవాల‌నే ల‌క్ష్యానికి తోడ్ప‌డుతుందని ప్రధానికి సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.

రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి

హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ‌-ప్రైవేటు సంయుక్త భాగ‌స్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న ర‌క్ష‌ణ రంగ ప్రాజెక్టుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైద‌రాబాద్‌లోని డీఆర్డీవో, డిఫెన్స్ పీఎస్యూ లు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయని , వాటి ప‌రిధిలో వేయ్యికి పైగా ఎమ్మెస్ఎంఈలు – స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయన్నారు. లాక్హిడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సఫ్రాన్ అండ్ హానివెల్, వంటి సంస్థలు హైదరాబాద్ పై ఆస‌క్తి చూపుతున్నాయని, ర‌క్ష‌ణ రంగంలోని జేవీలు, ఆఫ్సెట్లకు కేంద్ర ఆర్డర్లు త‌క్ష‌ణ అవసరం. ఆమోదం తెలిపేందుకు ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ ఉండాలని కోరారు.

హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రతిపాదన

యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్రోత్సాహం ఉంది, కానీ హైదరాబాద్‌కి లేదు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ‌కు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాల త‌యారీలో ముందున్న హైద‌రాబాద్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో నిర్వ‌హించాలని కోరారు.

హైద‌రాబాద్‌కు మ‌రో 800 ఈవీ బ‌స్సులు కేటాయించండి

- కేంద్ర మంత్రి కుమార‌స్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్‌కు మ‌రో 800 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు (ఈవీ) కేటాయించాల‌ని కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం భేటీ అయ్యారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు 2000 ఈవీ బ‌స్సులు కేటాయించార‌ని, ప్ర‌స్తుత న‌గ‌ర అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ ప‌థ‌కం కింద అద‌నంగా 800 బ‌స్సులు కేటాయించాల‌ని కోరారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బ‌స్సులకు రెట్రోఫిట్టెడ్ చేప‌ట్ట‌గా అది స‌ఫ‌ల‌మైంద‌ని, ఆ బ‌స్సులు న‌గ‌రంలో రాక‌పోక‌లు సాగిస్తున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. మిగతా డీజిల్ బ‌స్సుల‌కు రెట్రో ఫిట్‌మెంట్ అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

Next Story