Harish Rao : రియల్టర్ల ఆత్మహత్యలకు సీఎం బాధ్యుడు : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-09 04:43:52  IST  )

తెలంగాణ రాష్ట్రంలో రియల్టర్ల ఆత్మహత్యల(Suicides Of Realtors)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నే బాధ్యుడని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఆరోపించారు.

Harish Rao : రియల్టర్ల ఆత్మహత్యలకు సీఎం బాధ్యుడు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్టర్ల ఆత్మహత్యల(Suicides Of Realtors)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నే బాధ్యుడని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఆరోపించారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, నేడు ఆదిభట్లలో నరసింహ గౌడ్ ఆత్మహత్యల పట్ల ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగానికి చేరడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలన పాపం అన్ని రంగాలకు శాపంగా మారిందని.. ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నదని విమర్శించారు.

గతం ఎంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుగా నిలిచిందని, గడిచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నిజాన్ని దాచిపెడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశలో వెళ్తుంది అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప చేస్తుందేమీ లేదని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ రంగం నుండి వచ్చామని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఈ విషయాలు ఎందుకు అర్థం కావడం లేదని.. హైదరాబాద్ బాగుంటేనే, తెలంగాణ బాగుటుంది, అభివృద్ధి సాధ్యం అవుతుందన్న విషయం మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. హైడ్రా, మూసీ, ఫార్మా సిటీ, మెట్రో లైన్ మార్పు వంటి అంశాల్లో మీ అనాలోచిత నిర్ణయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో డిజాస్టర్ ను తెచ్చాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న ఆత్మహత్యలకు సీఎంగా రేవంత్ రెడ్డినే బాధ్యులని విమర్శించారు. మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారని..మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారని అందుకే సీఎందే రియల్టర్ల ఆత్మహత్యకు బాధ్యత అని హరీష్ రావు స్పష్టం చేశారు.

భేషజాలకు పోకుండా ఆత్మ విమర్శ చేసుకోండని..ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నరసింహ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

Next Story