- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CJP ప్రొటెస్ట్ కొనసాగుతుంది : అభిజిత్
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ, విద్యార్థుల ప్రధాన డిమాండ్లపై తమ పోరాటం మాత్రం ఆగిపోదని CJP నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : విద్యావ్యవస్థలో పారదర్శకత, నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం కోసం లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమణపై క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నాయకుడు అభిజిత్ దీప్కే తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు, హక్కుల కోసం సోనమ్ వాంగ్‌చుక్ ముందుకొచ్చి నిలబడటం దేశవ్యాప్తంగా పోరాడుతున్న యువతకు, విద్యార్థులకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. గత 26 రోజులుగా సాగిన ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత, ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రావడంతో ఆయన తన దీక్షను ముగించడం తమకు అత్యంత భారీ ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా X వేదికగా ఆయన స్పందిస్తూ— "మీ ధైర్యసాహసాలకు, దేశం కోసం మీరు చేసిన అపారమైన త్యాగానికి హృదయపూర్వక ధన్యవాదాలు సర్. మీ సొంత ప్రాణాలను, జీవితాన్ని పణంగా పెట్టి ఈ నిద్రపోతున్న దేశాన్ని, విద్యా వ్యవస్థలోని లోపాలను మేల్కొలిపారు. మీ ప్రాణం, మీ జీవితం ఈ దేశానికి ఎంతో అమూల్యమైనవి" అంటూ సోనమ్ వాంగ్‌చుక్ త్యాగాన్ని కొనియాడుతూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
అయితే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ, విద్యార్థుల ప్రధాన డిమాండ్లపై తమ పోరాటం మాత్రం ఇక్కడితో ఆగిపోదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసేంత వరకు తాము వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. విద్యా వ్యవస్థలో పూర్తిస్థాయి జవాబుదారీతనం తీసుకురావడం, బాధితులైన విద్యార్థులకు పూర్తి న్యాయం జరగడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆ డిమాండ్లు నెరవేరే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.






