- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్.. సౌత్-నార్త్ కనెక్టివిటీకి సిగ్నల్ క్లియర్!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతిష్టాత్మక కాజీపేట - బలార్షా మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణమధ్య రైల్వే నెట్‌వర్క్‌లోనే అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ మార్గానికి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రయాణికుల రైళ్లకు తోడు బొగ్గు, సిమెంట్ సరుకు రవాణాతో నిత్యం రద్దీగా ఉండే కాజీపేట -బలార్షా మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణంతో పాటు విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. సుమారు రూ.3వేలకోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో రైళ్లవేగం పెరగడమే కాకుండా, రాకపోకల్లో జాప్యానికి తెరపడనుంది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానం చేసే 203 కి.మీ. మేర ఆసిఫాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కి.మీ. చివరి విడత పనులు, అలాగే బిబ్రానదిపై నిర్మించిన కీలకమైన వంతెన నిర్మాణాన్ని అధికారులు ఈనెల 22న విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో ఈ కీలక మార్గం పూర్తిస్థాయిలో ప్రారంభానికి సిద్ధమైంది.
పరిశ్రమలకు గుండెకాయ
దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన రైలు మార్గమైన కాజీపేట- బలార్షా సెక్షన్ రవాణాపరంగా ఎంతో వ్యూహాత్మకమైంది. సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, భారీ సిమెంట్ పరిశ్రమలకు ఈ మార్గమే కీలకమైంది. నిరంతరం పెరుగుతున్న సరుకు, ప్రయాణికుల రాకపోకలతో ఈ లైన్‌పై విపరీతమైన ఒత్తిడి ఉండేది. దీనిని అధిగమించేందుకు 2015-16 బడ్జెట్‌లో 203 కి.మీ.(తెలంగాణ పరిధిలో 159 కి.మీ, మహారాష్ట్ర పరిధిలో 44 కి.మీ) మూడో లైన్ పనులకు ఆమోదం లభించింది. ఇప్పటికే రాఘవపురం -మందమర్రి మధ్య 33 కి.మీ పనులు గతంలోనే పూర్తయ్యాయి. 2020 నుంచి దశలవారీగా పనులు జరుపుకుంటూ వచ్చి తాజాగా సెంట్రల్ రైల్వేలోని బలార్షా యార్డ్ కనెక్టివిటీ మినహా మిగిలిన ప్రధాన భాగమంతా విద్యుదీకరణతో సహా పూర్తయింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
కీలక ప్రయోజనాలివే..
- మూడో లైన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రైళ్లకు సిగ్నల్స్ వద్ద నిరీక్షణ తీరి సమయపాలన మెరుగుపడుతుంది. సౌత్- నార్త కారిడార్ మరింత వేగవంతమైన ప్రయాణానికి వారధిగా మారనుంది.
- పవర్ ప్లాంట్లు, సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు మార్గం సుగమమైంది.
- పనులతో పాటు విద్యుదీకరణను పూర్తిచేయడం ద్వారా ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.
రైల్వే వసతులకు ఊపిరి
కాజీపేట- బలార్షా ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన ఇంజినీరింగ్, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్, ఆపరేటింగ్ విభాగాల సిబ్బంది అభినందనీయులు. ఈ మార్గం పూర్తికావడం ద్వారా ఉత్తర- దక్షిణ భారత రైల్వే అనుసంధానం మరింత బలపడటమే కాకుండా ఈ ప్రాంత రవాణా అవసరాలు సమర్థవంతంగా నెరవేరుతాయి. - సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, జీఎం దక్షిణ మధ్య రైల్వే






