- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లో కుంభవృష్టి.. ఏడాది వర్షం ఒక్కరోజులోనే
గుజరాత్ రాష్ట్రాన్ని భారీ కుంభవృష్టి ముంచెత్తింది. సాధారణంగా ఏడాది మొత్తం కురవాల్సిన వర్షపాతం కేవలం ఒక్క రోజులోనే కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర జలప్రళయం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ రాష్ట్రాన్ని భారీ కుంభవృష్టి ముంచెత్తింది. సాధారణంగా ఏడాది మొత్తం కురవాల్సిన వర్షపాతం కేవలం ఒక్క రోజులోనే కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర జలప్రళయం సంభవించింది. ముఖ్యంగా వల్సాద్ జిల్లాలోని ఉంబెర్ గావ్ తాలూకాలో రికార్డు స్థాయిలో కేవలం 16 గంటల వ్యవధిలోనే ఏకంగా 1100 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఊహించని ఈ వర్ష ప్రళయంతో వాపి, దాని పరిసర ప్రాంతాలలో వేలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే.. వీధుల్లో నిలిపి ఉంచిన వాహనాలు సైతం బొమ్మల్లా నీటిపై తేలిపోతూ కొట్టుకుపోతున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి.
భారీ వర్షాలు, వరదల తీవ్రత తగ్గకపోవడంతో వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. అందులో భాగంగా సూరత్, నవసారి, డాంగ్స్, తాపి జిల్లాలకు నేడు కూడా 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలను రంగంలోకి దించి, వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.






