- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులకే షాకిచ్చిన కొత్త ‘పీసీసీఎఫ్’.. ఏకంగా 15 మంది డిప్యూటేషన్లు రద్దు!
తెలంగాణ అటవీ శాఖలో ఇన్ఛార్జ్ పీసీసీఎఫ్ వినయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(ఇన్‌చార్జి PCCF) వినయ్ కుమార్.. ఐదుగురు మంత్రులకు ఝలక్ ఇచ్చినట్టు తెలిసింది. బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే అటవీశాఖలో డిప్యూటేషన్లు అన్నింటినీ రద్దు చేశారు. దీంతో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న సుమారు 15 మంది అధికారులు తమ సొంత పోస్టింగ్‌లో జాయిన్ అయ్యారు. అందులో ఐదుగురు మంత్రులకు చెందిన సన్నిహితలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. వినయ్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో షాక్‌కు గురైన సంబంధిత మంత్రులు.. అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేయగా.. ఆ ఫైల్‌ను తనకు పంపాలంటూ ఆదేశించినట్టు తెలుస్తున్నది.
డిప్యూటేషన్లు అన్ని రద్దు..
జూన్ 30 వరకు పీసీసీఎఫ్‌గా సువర్ణ పనిచేశారు. అమె హయాంలో సుమారు 15 మంది అధికారులకు (ఫారెస్ట్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు) ఆరోగ్యం, ఫ్యామిలీ కారణాలతో వారు కోరుకున్న చోట డిప్యూటేషన్ పద్ధతిన పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అందులో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి సన్నిహితులు, బంధువులు, పార్టీ లీడర్ల పిల్లలు ఉన్నారు. వారంతా హాయిగా తమకు ఇష్టమైన ప్రాంతాల్లో పనిచేస్తుండగా, ఇన్‌చార్జి హోదాలో బాధ్యతలు తీసుకున్న పీసీసీఎఫ్ వినయ్ కుమార్ వచ్చిన వెంటే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రెగ్యూలర్ పోస్టింగ్‌లో కాకుండా, లాబీయింగ్‌తో సుమారు 15 మంది అధికారులు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే అటవీ శాఖలో డిప్యూటేషన్లు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు సర్క్యూలర్ జారీ చేశారు. అప్పటివరకు ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేస్తున్న అధికారులు సొంత ఏరియాల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది.
మంత్రికి తెలీకుండానే నిర్ణయం
సాధారణంగా సహచర మంత్రుల సిఫారసుల మేరకు అధికారులకు డిప్యూటేషన్లు ఇవ్వడం ప్రతి శాఖలో జరుగుతుంటుంది. అందులో భాగంగా మంత్రి కొండా సురేఖ ఐదుగురు మంత్రులు పంపిన సిఫారసులను అప్పటి పీసీసీఎఫ్ సువర్ణకు పంపగా, ఆమె వారందరికీ డిప్యూటేషన్లు ఇచ్చారు. కానీ వినయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మంత్రి కొండా సురేఖ నుంచి అనుమతి తీసుకోలేదని తెలిసింది. ఏకపక్షంగా డిప్యూటేషన్లు రద్దు చేయడంతో బాధితులు అందరూ తమకు సిఫారసు చేసిన మంత్రుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సదరు మంత్రులు మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేయగా, ఆమె స్వయంగా పీసీసీఎఫ్‌కు ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. ‘‘రద్దు చేసిన డిప్యూటేషన్లను కొనసాగించాలి. ఒకవేళ మీ స్థాయిలో నిర్ణయం తీసుకోకపోతే ఫైల్‌ను నాకు పంపండి. నేను పర్మిషన్ ఇస్తాను. సెక్రెటరీ జీవో జారీ చేస్తారు’’ అని ఆదేశించగా, అప్పుడు సరేనంటూ తలూపిన పీసీసీఎఫ్ ఇంతవరకు ఫైల్ పంపలేదని ప్రచారం జరుగుతున్నది.






