ఇంజినీర్లకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి: ఎంపీ ఈటల రాజేందర్​ డిమాండ్

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ ఇంజినీర్లను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

ఇంజినీర్లకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి: ఎంపీ ఈటల రాజేందర్​ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో బీఆర్‌ఎస్ నేతలు, రిటైర్డ్ ఇంజినీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఖబర్దార్ రేవంత్ రెడ్డి! పదవి ఉందనే అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాత్రింబగళ్లు కష్టపడిన ఇంజినీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు.

2023లో లక్ష్మీ బ్యారేజ్ వద్ద రెండు పిల్లర్లు కుంగిపోయాయి. డిజైన్ల తప్పుంటే విచారణ చేసి ఇంజినీర్లను, క్వాలిటీలో లోపాలు ఉంటే ఆ కాంట్రాక్టర్‌ను, అలాగే ఎవరి సలహా పట్టించుకోకుండా నాటి పాలకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే నాటి పాలకులను బాధ్యులను చేసి శిక్ష వేయాలన్నారు. కాగితాలకే పరిమితమైన ఎస్సారెస్పీ ఆయకట్టులో రెండు పంటలు పండాయి. మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం, సుందిళ్ల పనికిరావని సీఎం రేవంత్‌రెడ్డి అనడం సరికాదన్నారు. ఎన్డీఎస్‌ఏ పేరు చెప్పి తప్పించుకుంటున్న ముఖ్యమంత్రి ఇక్కడి రిటైర్డ్‌ ఇంజినీర్లు, సాగునీటి నిపుణుల సూచనలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బ్యారేజీతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చని ఇంజినీర్లు సూచిస్తున్నా, ముఖ్యమంత్రి భేషజాలకు పోతూ తెలంగాణ రైతాంగం నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపారు.

అనంతరం రిటైర్డ్ ఇంజనీర్లు దామోదర్ రెడ్డి, వెంకటేశం, శ్రీధర్ దేశ్ పాండే, వెంకట రామారావులు మాట్లాడుతూ... ప్రస్తుతం ఎల్‌నీనో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీళ్లు డెడ్‌ స్టోరేజీకి చేరాయన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటికి, పరిశ్రమలకు నీళ్లు కావాలంటే ముఖ్యమంత్రి తాము చేసిన సూచనలే కాదు, కేంద్ర ప్రభుత్వ నిపుణుల సలహాలు తీసుకుని అయినా నీళ్లను ఎత్తిపోయాలన్నారు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసుకునే వెసులుబాటు, అందుకు కావాల్సిన యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందన్నారు. గోదావరిలో ప్రాణహిత వద్దనే నీటి లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ కూడా పేర్కొన్నదని వారు గుర్తు చేశారు. మేడిగడ్డ నింపితే కూలిపోతుందని, భద్రాచలం మునిగిపోతుందని ముఖ్యమంత్రి భయపెట్టే ప్రకటనలు చేస్తున్నారని, ఆ వాదనలు తప్పన్నారు. ప్రస్తుతం వస్తున్న వరదల కంటే రెట్టింపు స్థాయిలో నీళ్లు వచ్చినా ఏమీ కాలేదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయాలన్నారు. లేకపోతే కరెంటు సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక నిపుణులు పి. పాపారావు, బీజేపీ నేత వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్, సీనియర్ జర్నలిస్టులు గొర్ల బుచ్చన్న, ఎ. రమణ కుమార్, నర్రా విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story