బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై KCR ఫోకస్.. కవిత అరెస్టును ఆపేందుకు బిగ్ స్కెచ్..?!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై KCR ఫోకస్.. కవిత అరెస్టును ఆపేందుకు బిగ్ స్కెచ్..?!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఎదురుకాబోయే పరిణామాలు, వాటిని నివారించడానికి ఉన్న మార్గాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అలర్ట్ అయ్యారు. ఇప్పటికే మూడుసార్లు ఈడీ అధికారులు విచారించడంతో ఏ దిశగా ఎంక్వయిరీ జరుగుతున్నదో గ్రహించిన కేసీఆర్.. ఏదేని పరిస్థితుల్లో అరెస్టు అనివార్యమైతే దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. అందుకోసం ఉన్న న్యాయపరమైన అవకాశాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్న ఆయన.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన అధికారులతోనూ చర్చించినట్టు తెలిసింది.

ఈడీ దర్యాప్తు సంస్థలో పనిచేసిన అనుభవంతో తాజాగా ఆమెను మూడు దఫాలుగా విచారించినప్పుడు లిక్కర్ స్కామ్‌తో కవితకు ఉన్న ప్రమేయాన్ని రూఢీ చేసుకోడానికి లేవనెత్తిన అంశాలు, ఇకపైన దాన్ని ఏ రూపంలోకి తీసుకెళ్లబోతున్నారనే అభిప్రాయాలను సదరు మాజీ అధికారితో చర్చించినట్టు తెలిసింది. మళ్లీ విచారణకు పిలవనున్నట్టు ఈడీ ఇప్పటికే స్పష్టత ఇచ్చినా.. ఇంకా తేదీని ఖరారు చేయకపోవడంతో ఇకపైన ఎలాంటి అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టే చాన్స్ ఉందనే అంచనా వేసి దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిపైనా సదరు రిటైర్డ్ అధికారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నట్టు తెలిసింది.

ఏదేని పరిస్థితుల్లో కవితను అదుపులోకి తీసుకోవడం లేదా అరెస్టు చేయడం లాంటి నిర్ణయం జరిగితే లీగల్‌గా ఎలా ప్రిపేర్ కావాలనే దానిపైనా ఆరా తీసినట్టు సమాచారం. అరెస్టు వరకూ వెళ్లకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలు, లాజిక్ గురించి ఆయన అనుభవం ద్వారా కొన్నింటిని కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది.

న్యాయ నిపుణుల నుంచి ఇప్పటికే తీసుకున్న సలహాలను సైతం సదరు రిటైర్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. న్యాయనిపుణులు ఇచ్చిన సలహా మేరకే సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ గురించి, ఆ పిటిషన్‌లో ఆమె చేసిన ప్రేయర్‌‌లో తాజాగా కొన్ని మార్పులు చేయడాన్ని కేసీఆర్ ఆయనతో షేర్ చేసుకున్నట్టు సమాచారం. రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో జరిగిన సమావేశాల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం పాలు పంచుకున్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రగతిభవన్‌లో రోజంతా చర్చలు

కవిత ఈడీ విచారణకు వెళ్లినప్పట్నించి కేసీఆర్ ఫ్యామిలీలో ఆందోళన నెలకొన్నది. విచారణకు వెళ్లిన ప్రతిసారీ ఆమెకు ఏం ఇబ్బందులు వస్తాయోనని గుబులు పట్టుకున్నది. త్వరలో కవితను ఈడీ విచారణకు పిలిస్తే అప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అనుమానం వెంటాడుతున్నది. ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఫ్యామిలీలోని కీలక వ్యక్తులు, దగ్గరి బంధువులు, సన్నిహితులు సమావేశమై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించే తాజా మాజీ ఐపీఎస్ (కేంద్ర దర్యాప్తు సంస్థలో పనిచేసిన ఆఫీసర్) అధికారిని ప్రగతి‌భవన్‌కు పిలిపించుకుని రోజంతా చర్చించి ఆయన నుంచి గతానుభవం మేరకు కొన్ని సూచనలు, సలహాలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మూడు దఫాలుగా జరిగిన ఎంక్వయిరీలో కవితను ప్రశ్నించిన తీరు, వారు వేటిమీద ఫోకస్ పెట్టి ప్రశ్నించారో ఆయనకు వివరించినట్టు తెలిసింది. ఎంక్వయిరీ సందర్భంగా ఈడీ అధికారుల తీరు ఎలా ఉంటుంది.. సమాధానాలు ఏ తీరులో చెబితే చిక్కులు లేకుండా చూసుకోవచ్చు.. అరెస్టు వరకూ వెళ్లకుండా కొంతకాలం దాటవేయడానికి ఉన్న మార్గాలు తదితరాలపై ఆయన నుంచి కొన్ని సలహాలు తీసుకున్నట్టు సమాచారం.

ఈడీ ఎంక్వయిరీ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈనెల 27న విచారణకు రానున్నది. కోర్టులో వాదనలు ఏ రకంగా ఉండాలి.. లీగల్‌గా ఈడీకి చెక్ పెట్టే తీరులో ఎలాంటి అంశాలను లేవనెత్తాలి.. గతంలోని తీర్పుల్లో న్యాయమూర్తులు వెలువరించిన అంశాలను సోదాహరణంగా ఎలా ప్రస్తావించాలి.. ఓరల్‌గా అభిప్రాయాలను సందర్భానుసారం ఈ పిటిషన్‌కు ఎలా జోడించాలి.. తదితరాలన్నింటిపై కేసీఆర్ దృష్టి పెట్టారు.

వ్యూహాత్మకంగా అడుగులు

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జీలు, న్యాయ నిపుణులు తదితరుల నుంచి అన్ని విధాలుగా సలహాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగు వేయాలని భావిస్తున్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ అధికారులు విచారణకు పిలిచిన రోజునే అరెస్టు చేసి మొదటి దఫాలోనే వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్న అంశాన్ని కవితను ఎంక్వయిరీకి పిలిచిన ఇష్యూతో పోల్చి చూసుకుంటున్నారు. మూడు దఫాలుగా విచారణకు హాజరైనా ఆమె అరెస్టు కాకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యామనే భావనతో పాటు ఈడీని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని తొందరపడి అరెస్టు చేయకుండా కట్టడి చేయగలిగామనే ధీమా సైతం కేసీఆర్‌లో కనిపిస్తున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

ఈడీని ఒక మేరకు ఆచితూచి అడుగేసేలా చేయడంతో పాటు ఇతరులను ప్రశ్నించడానికి అనుసరించిన పద్దతులకంటే భిన్నంగా కవిత విషయంలో వ్యవహరించేలా చేయగలిగామన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. ఈ కారణంగానే మిగిలినవారి తరహాలో కవిత విషయంలో ఈడీ నిర్ణయం తీసుకోవడంలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందన్న ధీమా వ్యక్తమవుతున్నది. రాత్రి తొమ్మిది గంటల వరకూ విచారించిన తర్వాత తిరిగి ఇంటికి వస్తారా? లేక అరెస్టు అవుతారా? అనే ఆందోళన రెండు రోజుల పాటు బీఆర్ఎస్, భారత్ జాగృతి శ్రేణుల్లో వ్యక్తమైంది.

కానీ కవిత వేసిన లీగల్ స్టెప్పులు, ఈడీ వ్యవహరిస్తున్న తీరు ఆమె విషయంలో దుందుడుకు నిర్ణయం తీసుకోకుండా నివారించినట్లయిందనే అభిప్రాయమూ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఇకపైన జరిగే విచారణల సందర్భంగా రిటైర్డ్ అధికారులు, జడ్జీలు ఇచ్చిన సూచనలతో ఎలాంటి రిలీఫ్ లభిస్తుందన్నది కాలమే తేల్చనున్నది. ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానున్నది. అనంతరం రానున్న కాలంలో ఈడీ తీరు ఎలా ఉంటుందో సూచనప్రాయంగా కొంత స్పష్టతకు వచ్చే చాన్స్ ఉంది.



Next Story