ఆ పని చేయాలంటే దిల్లుండాలే: విపక్షాలకు సీఎం కేసీఆర్ కౌంటర్

by Satheesh |   (  Updated:2023-07-24 15:20:15  IST  )

బీఆర్ఎస్ పార్టీ ఒక టాస్క్ కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఆ పని చేయాలంటే దిల్లుండాలే: విపక్షాలకు సీఎం కేసీఆర్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఒక టాస్క్ కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. కేసీఆర్ అనిల్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్‌లా పనిచేశామని తెలిపారు. రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పంట పొలాలు ఎండిపోయేవని.. కానీ ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కరెంట్ అందిస్తున్నామన్నారు.

గత ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. మనం 24 గంటల విద్యుత్ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఆగమైపోయిందని.. తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. రైతులకు ఈ స్థాయిలో విద్యుత్ ఇవ్వాలంటే దిల్లుండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతుల పంటసాగు చూసి గుండె ఉప్పొంగుతోందని.. ఎటు చూసినా వరి కుప్పలే దర్శనమిస్తున్నాయన్నారు. కొందరు 3 గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌పై విపక్షాలు చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. రూ. 80 వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు ఎప్పుడో తీరిందని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో భూముల విలువ పెరగడంతో పాటు.. రైతుల పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.

Next Story