రోడ్డు ఊడ్చారు.. కుప్పలు వదిలేశారు: 15 రోజులుగా నిలిచిన పారిశుధ్య పనులు!

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌ను ‘క్లీన్ అండ్ గ్రీన్’ నగరంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వాదనలు నేలమట్టమవుతున్నాయి.

రోడ్డు ఊడ్చారు.. కుప్పలు వదిలేశారు: 15 రోజులుగా నిలిచిన పారిశుధ్య పనులు!
X

దిశ, హస్తినాపురం: హైదరాబాద్‌ను ‘క్లీన్ అండ్ గ్రీన్’ నగరంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వాదనలు నేలమట్టమవుతున్నాయి. నగర పరిధిలోని ప్రధాన రహదారుల పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. ముఖ్యంగా నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై మట్టి, కంకర పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ బైఫర్ కేషన్‌లో భాగంగా ఏర్పడిన మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

15 రోజులుగా నిలిచిన శుభ్రత పనులు..

సాగర్ రింగ్ రోడ్ నుంచి బీఎన్ రెడ్డి చౌరస్తా వరకు రెండు వారాలుగా రోడ్ల శుభ్రత పనులు చేపట్టకపోవడం గమనార్హం. ముందుగా ఊడ్చి కుప్పలు కట్టిన మట్టిని కూడా తొలగించకుండా అలాగే వదిలేయడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. రోడ్లపై ఉన్న మట్టి, కంకర భారీ వాహనాల రాకపోకలతో గాల్లోకి ఎగిరి వెనుక నుంచి వచ్చే వాహనదారుల కళ్లలో పడుతున్నది. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల కంకరపై జారిపడి వాహనదారులు గాయపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

లారీలు, టిప్పర్ల నిర్లక్ష్యంతో సమస్య తీవ్రం..

భవన నిర్మాణాలకు తీసుకెళ్తున్న ఇసుక, మట్టి, కంకర లారీలు, టిప్పర్లు రహదారులపై పదార్థాలను జారవిడుస్తుండడంతో సమస్య మరింత తీవ్రమవుతున్నది. సాగర్ రింగ్ రోడ్, సంతోషిమాత కమాన్ ప్రాంతాల్లో వారం రోజులుగా కంకర అలాగే రోడ్లపై పడిఉండిపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. జీహెచ్ఎంసీ బైఫర్‌కేషన్ అనంతరం అధికారులు, సిబ్బంది బదిలీలు జరిగినప్పటికీ కొత్త నియామకాలు లేకపోవడంతో పనులు స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. అదనంగా, కార్యాలయాల్లో సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది.

Next Story