TG: రైతుభరోసా పథకం నిలిపివేత అంటూ ప్రచారం.. క్లారిటీ

by Gantepaka Srikanth |

TG: రైతుభరోసా పథకం నిలిపివేత అంటూ ప్రచారం.. క్లారిటీ

TG: రైతుభరోసా పథకం నిలిపివేత అంటూ ప్రచారం.. క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని(Rythu Bharosa) నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఆ వార్త పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌(Telangana Government Fact Check) విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది. ‘రైతుభరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. అలాగే నిలిపివేయడమూ లేదు. ప్రస్తుతం, సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందేలా చూసుకోవడానికి గ్రౌండ్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తున్నాయి. అలాగే, ఆర్థికశాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది. రైతుభరోసా నిలిపివేస్తున్నారని అని ప్రచారమవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం, అలాగే లబ్ధిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

శాటిలైట్ మ్యాపింగ్ :

వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుండి తొలగించడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సహాయంతో 'శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోంది. 2024 సంవత్సరంలో నిర్వహించిన ఒక గ్రౌండ్ సర్వే ప్రకారం 4 లక్షల ఎకరాల భూమి, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో వాణిజ్య వినియోగంలో ఉంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి లబ్ధిదారుని దగ్గర ఎంత భూమి సాగు విస్తీర్ణంలో ఉందో నిర్దారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచరా, కొండ, రోడ్ లేదా ఫామ్ హౌస్ అని ధృవీకరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూములు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం పొందడానికి అర్హత కలిగినవి కావు. మ్యాపింగ్ ప్రక్రియ అనేది ఫీల్డ్ డేటాను రికార్డులతో ధృవీకరించడానికి మాత్రమే. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా జాబితా నుండి తొలగింపులు ఉంటాయి.

ఒకవేళ జాబితా నుంచి పేర్లు తొలగించిన, అభ్యంతరాలు ఉన్న రైతులు.. వివరణ కోసం జిల్లా కలెక్టర్‌, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు. గతేడాది సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం 90 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది. నిజమైన లబ్దిదారులకు నష్టం జరగవద్దని సీఎం ఆదేశించారు. ప్రజలు ఎవరూ రైతు భరోసాపై దుష్ప్రచారాలు, అసత్య వార్తలను నమ్మొద్దు’’ అని విజ్ఞప్తి చేసింది.

Next Story