‘పాలమూరు’ 90 శాతం పూర్తయిందనేది అబద్ధం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం

by Kema Shiva Kumar |

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

‘పాలమూరు’ 90 శాతం పూర్తయిందనేది అబద్ధం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జలసౌధలో జరిగిన ఈ భేటీలో పాలమూరు ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, పనుల పురోగతిపై మంత్రి క్షుణ్ణంగా చర్చించారు. సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) పనులు 90 శాతం పూర్తయ్యాయని గత పాలకులు చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. ప్రాజెక్టు డిజైనును జూరాల (Jurala) నుంచి శ్రీశైలం (Srisailam)కు మార్చడం వల్ల ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే, కేవలం కాల్వల కోసం టెండర్లు పిలిచి కాలయాపన చేశారని మంత్రి మండిపడ్డారు.

15 రోజుల్లో పూర్తి స్థాయి సమీక్షా సమావేశం..

పాలమూరు-రంగారెడ్డి సహా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి, మిగిలి ఉన్న పనుల షెడ్యూల్‌తో కూడిన సమగ్ర నివేదికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో పాలమూరు ప్రాజెక్టులపై మరోసారి పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. జూరాల ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story