బోగస్ రేషన్ కార్డులపై ‘సివిల్ సప్లై’ ఫోకస్.. ఏరివేతకు ముహూర్తం ఫిక్స్!

by Kema Shiva Kumar |

రేషన్ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది.

బోగస్ రేషన్ కార్డులపై ‘సివిల్ సప్లై’ ఫోకస్.. ఏరివేతకు ముహూర్తం ఫిక్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ఎంతో మంది యువకులు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఎంతో మంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. సుమారు 2.20 లక్షల పేర్లతో ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు తెలిసింది. వివరాలు సేకరించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కార్డుల్లో పేరు ఉండి అందుబాటులో లేని, మరణించిన వారి పేర్లను గుర్తించేందుకు సిబ్బంది పక్షం రోజులుగా ఇంటింటి పరిశీలన చేస్తున్నారు. ఇలాంటి వారి పేర్లను తొలగించిన తర్వాత.. ధనవంతుల కార్డులను కత్తిరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే అనర్హులను తొలగించాలని భావించింది. అయితే స్థానిక రాజకీయ నాయకుల అభ్యంతరాలతో ఆ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని, అప్పటివరకు వేచి చూడాలని కోరడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. అయితే పంచాయతీ ఎన్నికల తరువాత అనర్హులకు రేషన్ కార్డులు తొలగించక తప్పదని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.

ధనవంతుల కార్డులూ కట్!

గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షల లోపు ఆదాయం ఉన్న వారికే రేషన్ కార్డులు అనే నిబంధనలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ధనవంతులు కూడ పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు పొందారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీవంటి ఉచిత వైద్య సేవలకు వాటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నెలవారీగా పంపిణీ చేసే బియ్యం తీసుకోవడం లేదు. దుకాణాల వద్ద క్యూలైన్లలో ఉండాల్సిన అవసరం తమకు లేదని, డీలర్లకే ఆ బియ్యాన్ని అప్పగిస్తూ కిలోకు రూ. 10 చొప్పున తీసుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. దీంతో పీడీఎస్ రైస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నదనే విమర్శ ఉన్నది. ఇలాంటి వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షలు ఉండవచ్చని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అనర్హుల జాబితా పరిశీలన సమయంలో ధనవంతుల కార్డులు కూడా తొలగిస్తారని ముందుగానే లీకులు ఇస్తున్నారు.

‘కట్’ చేస్తే ప్రభుత్వంపై తగ్గనున్న భారం

ఉచిత రేషన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10,655 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అందులో రాష్ట్రం వాటా రూ. 5,175 కోట్లు కాగా, కేంద్రం రూ. 5,485 కోట్లు భరిస్తున్నది. అయితే గత ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ. 2,858 కోట్ల భారం పడుతున్నది. మరోవైపు ఇటీవల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత బీఆర్ఎస్ పాలనలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరింది. ఇంతమందికి ఉచితంగా ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారింది. అందుకోసం ముందుగా అడ్రస్ లేని, మరణించిన వారి పేర్లు తొలగించాలని భావిస్తున్నది. ఆ తర్వాత ధనవంతుల కార్డులనూ కట్ చేస్తే రూ. 500 కోట్ల భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజల పేర్లు తొలగిస్తేనే సమస్యలు వస్తాయని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వారి పేర్లు తొలగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నది. వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు కూడా ఉండవని అనుకుంటున్నది.

Next Story