‘నిర్ణయం తీసుకోవాల్సిన సమయమొచ్చింది’.. మావోయిస్టు పార్టీకి మేధావుల విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-21 16:06:37  IST  )

తెలంగాణ ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు, మేధావులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

‘నిర్ణయం తీసుకోవాల్సిన సమయమొచ్చింది’.. మావోయిస్టు పార్టీకి మేధావుల విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీ(Maoist Party)కి తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు, మేధావులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ముందుగా.. ‘ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైవ సామాజిక - ఆర్థిక మార్పునకు మీరు చేసిన కృషి చాలా గొప్పది. మీ పోరాటం కారణంగానే ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నిబద్ధతతో, నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన మీలాంటి వారి అవసరం నేటి సమాజానికి ఉందని కూడా మేము నమ్ముతున్నాం. అయితే వర్తమాన పరిస్థితుల్లో మీ కార్యాచరణను సమీక్షించుకొని లీగల్ మార్గాల ద్వారా ముందుకు తీసుకొనివెళ్ళవలసిన అవసరం కనబడుతున్నది. ఈ దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలని మావోయిస్టు పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాం.

దీంతో పాటు మావోయిస్టులు తమ ఆచరణను సమీక్షించుకోవడానికి సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ చారిత్రక సందర్భంలో, సమాజంలో శాంతిని పెంపొందించే లక్షంతో, మార్పునకు దోహదపడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని పౌర హక్కుల సంఘం నేతలు, మేధావులు కోరారు.

ప్రకటన విడుదల చేసిన వారిలో ప్రొఫెసర్ జి.హరగోపాల్. ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి. ప్రొఫెసర్ రమా మేల్కొటే, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, ప్రొఫెసర్ కల్పన కన్నాభిరాన్, కే.శ్రీనివాస్‌లు ఉన్నారు.

Next Story