- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నత్తనడకన సీఐడీ కేసుల ఇన్వెస్టిగేషన్..! అరకొర అరెస్టులే
ఫ్రాడ్, రియల్ ఎస్టేట్ మోసాలు, క్రిప్టో కరెన్సీ మోసాలు తదితర విషయాల్లో సీఐడీ నమోదు చేసిన కేసుల్లో విచారణలో పురోగతి కనిపించడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్రాడ్, రియల్ ఎస్టేట్ మోసాలు, క్రిప్టో కరెన్సీ మోసాలు తదితర విషయాల్లో సీఐడీ నమోదు చేసిన కేసుల్లో విచారణలో పురోగతి కనిపించడం లేదు. బాధితుల ఫిర్యాదుతో కేసులు మొదట సీసీఎస్ (క్రైమ్ విభాగం)లో నమోదువుతున్నాయి. కేసు తీవ్రతను బట్టి సీఐడీ (క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్మెంట్)కు బదిలీ చేస్తున్నారు. గత కొద్దికాలంగా సీఐడీ చేపట్టిన కేసుల విచారణలో అసలు నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ బాధ్యతలను మొన్నటి వరకు చూసిన ఒక ఉన్నతాధికారికి మరో మూడు అదనపు బాధ్యతలు కూడా ఉండటంలో సీఐడీ విభాగంపై దృష్టి సారించలేక పోయారని చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం సీఐడీ విభాగానికి అడిషనల్ డీజీపీగా నియమితులైన తెలంగాణకి చెందిన ఐపీఎస్ అధికారి తన మార్క్ ఇన్వేస్టిగేషన్ చూపితే న్యాయం జరుగుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫాల్కమ్ స్కామ్‌లో..
ఫాల్కన్ స్కామ్ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారిని వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేసినట్లు గత సీఐడి డీజీ పలు ప్రకటనల్లో వెల్లడించారు. కాని సీఐడీ పట్టుకున్న నిందితులు.. అసలు మెయిన్ నిందితులు కాదని తెలుస్తున్నది. ఇటీవల సీఐడీ అరెస్ట్ చేసిన నిందితులు కేసులో ఏ21, ఏ23, ఏ24గా ఉన్నారు. దీంతో కేసు పురోగతిపై బాధితులకు ఆందోళన నెలకొన్నది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులో 4,065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్లు మోసాలకు పాల్పడ్డారని సీఐడీ వెల్లడించింది. అధిక వడ్డీ రేట్ల సాకుతో డిపాజిటర్లను ప్రలోభపెట్టి 7,056 డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేశారని తెలుస్తుంది. మే 18వ తేదిన ఇద్దరు నిందితులను ఏ23, ఏ24 అరెస్ట్ చేసింది. జూన్ 5 తేదీన కేసులో ఏ21 నిందితుడిగా పేర్కొన్న ఒకరిని సీఐడీ అరెస్ట్ చేసి రూ.2.5 కోట్ల విలువైన మూడు కార్లను సీజ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నది. రూ.850 కోట్ల విలువ చేసే విమానాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మిగతా నిందితుల అరెస్ట్, నష్ట పరిహరం పై బాధితులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇతర కేసుల్లోనూ..
-హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన అవయవ మార్పిడి కేసును కూడా సీఐడీ దర్యాప్తు చేస్తుంది. అలకానంద హస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో 13మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలుపుతున్నారు. ఈ కేసులో ఇంకా ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారు పట్టుబడితే కానీ కేసు విచారణ కొలిక్కి వచ్చేలా లేదు.
-జీబీఆర్ క్రిప్టో కాయిన్ చీటింగ్ కేసు కూడా సీఐడీ చేతిలో ఉంది. అధిక లాభాల పేరుతో ఆశ చూసి డిపాజిటర్ల నుంచి సుమారు రూ.95 కోట్లు వసూలు చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇటీవల అరెస్ట్ చేసిన నిందితులు కేసులో ఏ11, ఏ12లుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులగా పేర్కొన్న ఏ1, ఏ2, ఏ6, ఏ7 అరెస్ట్ చేసింది. మిగతా వారిని అరెస్టు చేస్తేనే కేసు ముందుకు వెళ్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-బెట్టింగ్ యాప్ కేసు కూడా సీఐడీ పరిధిలో ఉంది. ఐజీ స్థాయి ఆఫీసర్ ను సిట్ అధికారిగా కూడా నియమించారు. ఐదుగురు సభ్యులతో కూడిన స్పెషల్ టీం ను ఏర్పాటు చేశారు. ఈ కేసులలో కూడా పురోగతి లేదు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉన్న నియమ నింబధనల మేర, బెట్టింగ్ యాప్ నిర్వహకులు విదేశాల నుంచి యాప్ నిర్వహణ చేయడం కేసు ముందుకు సాగడం లేదు.






