- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC Reservations: రిజర్వషన్లు చట్టబద్ధం లేకుండా ఎన్నికలా? ఇది బీసీలను మరోసారి మోసం చేయడమే: టి.చిరంజీవులు
పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని 42 శాతం బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: డిసెంబర్‍లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని 42శాతం బీసీ రిజర్వేషన్స్ (BC Reservations) సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. బీసీ వర్గాల న్యాయపరమైన హక్కైన 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధం చేయకుండా ఎన్నికలు జరపడం అంటే బీసీలను మరోసారి మోసం చేయడమేనని, బీసీలను రాజకీయంగా ఎదగకుండా నిరోధించే కుట్రగా ఈ నిర్ణయాన్ని భావిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ బీసీ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు (T.Chiranjeevulu) ప్రెస్ నోట్ విడుదల చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రధాన మంత్రితో భేటీకి అపాయింట్‍మెంట్ తక్షణమే పొందాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ఆమోదం తీసుకురావడం 9వ షెడ్యూల్ లో చేర్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. ఇది కేవలం రాజకీయ హామీ కాదని ఇది బీసీ వర్గాల రాజ్యాంగ బద్ధమైన హక్కును రక్షించే పరీక్ష అన్నారు.
ప్రధాని అపాయింట్‍మెంట్ ఇవ్వకపోతే..
ఒక వేళ ప్రధాన మంత్రి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభు్తవం సహకరించకపోతే ఏం చేయాలో కార్యచరణను సైతం చిరంజీవులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అడ్డంకులకు బీజేపీ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, కేద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు భారీ స్థాయిలో ప్రజాపోరాటం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించి తమ ఇండియా కూటమి సభ్యులతో పార్లమెంట్ సమావేశాలు స్తంభింప చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పై చర్యలను వెంటనే అమలు చేయాలని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ వర్గాల ప్రయోజనాల పట్ల అంకిత భావం లేని పార్టీగా ప్రజల ముందు నిలుస్తుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం చేపట్టిన అన్ని చర్యలు, కార్యక్రమాలు బీసీ ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకంగా, ఒక బూటకపు చర్యగా ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధతలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.






