- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొంతులు కోస్తున్న చైనా మాంజా.. విలవిలలాడిపోతున్న బాధితులు
పతంగుల పండగ పలువురిలో కలవర పెడుతుంది. పతంగులకు వాడే చైనా మాంజా మనుషుల గొంతులు కోస్తోంది.

దిశ కొత్తగూడెం రూరల్: పతంగుల పండగ పలువురిలో కలవర పెడుతుంది. పతంగులకు వాడే చైనా మాంజా మనుషుల గొంతులు కోస్తోంది. దీంతో గాయపడిన బాధితులు విలవిలలాడిపోతుండగా మరికొందరు ప్రాణాలు సైతం పోయిన ఘటనలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. చైనా మాంజా మనుషుల పాలిట యమపాశంగా మారడంతో పాటు మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయని పట్టణంలోని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా కొత్తగూడెం మండల పరిధిలోని పలు గ్రామాలలో పతంగుల దుకాణాలు వెలిశాయి. అలాగే పట్టణంలోని పెద్ద బజార్ రామ టాకీస్ ఏరియా మేదర బస్తి, గణేష్ టెంపుల్ ఏరియా రామవరం తదితర ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు పతంగుల దుకాణం ఏర్పాటు చేసి ఆ దుకాణాలలో చైనా మాంజా దారాలను విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గాలిపటాలకు ఉపయోగించే చైనా మాంజాలు మనుషుల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. కత్తుల కంటే పదునుగా కుత్తుకలను కోస్తోంది. ప్రమాదకరమైన ఈ చైనా మాంజాను వినియోగించొద్దని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు వ్యాపారులు మాంజాతో వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. ఇటీవల రామవరం ప్రాంతంలో ఒక వ్యక్తి బండిపై పోతుండగా చైనా మాంజా ఆయన మెడకు తగిలి తీవ్ర గాయం అవ్వడంతో వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. గాయంతో కొన్ని రోజులపాటు ఇబ్బందిపడి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది జరిగి రోజులు గడవక ముందే తాజాగా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు సెంటర్లో చైనా మాంజాతో గాయపడిన ఘటన బుధవారం చోటు చేసుకోవడంతో పలువురులో కలవరం మొదలైంది. చైనా మాంజా మాట వినబడితేనే వామ్మో మనుషుల పాలిట యమపాశం అంటూ జనం భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.
మాంజాతో భార్యాభర్తలకు గాయాలు..
కొత్తగూడెం విద్యానగర్ బైపాస్ రోడ్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువ దంపతులకు చైనా మాంజాదారం తగిలి గాయాలు కావడం జరిగింది. పాల్వంచ పట్టణానికి చెందిన నవీన్ సుప్రజ దంపతులు పాల్వంచ నుంచి పాత కొత్తగూడెం విద్యానగర్ బైపాస్ రోడ్డు మీదగా జూలూరుపాడు వెళుతుండగా విద్యానగర్ బైపాస్ రోడ్డులో గాలి పటానికి వినియోగించిన చైనా మాంజాదారం నవీన్ గొంతుకు తగలడంతో అప్రమత్తమై వెంటనే అతని చేత్తో మాంజా దారాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అతని గొంతు చుట్టూ స్వల్పంగా గాయమైంది. ఇదే క్రమంలో సుప్రజ మాంజాదారం తొలగించే క్రమంలో ఆమె చేతి వేళ్లు తెగి గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరికీ బైపాస్ రోడ్డు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు స్పందించి రక్తస్రావం కాకుండా ప్రథమ చికిత్స చేశారు.
ఆగని దందా..
చైనా మాంజలు అమ్మకుండా పోలీసులు దాడులు చేస్తున్నా.. కొందరు దొంగ చాటుగా మాంజాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల పెద్ద బజార్ చిన్న బజార్లో పతంగుల దుకాణాల్లో 3వ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి, చైనా మాంజాలను స్వాధీనం చేసుకొని కొందరిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసింది తెలిసిందే. అయినప్పటికీ అక్కడక్కడ చైనా మాంజాలను అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుండడం బాధాకరం. పతంగుల దుకాణాల వద్ద నిరంతరం నిఘాను ఏర్పాటు చేసి చైనా మాంజాలను అమ్మకుండా గట్టు చర్యలు తీసుకోవాలని నలుగురు డిమాండ్ చేస్తున్నారు.






