ఆ బాధ్యత గ్రామ పంచాయతీలదే.. నొక్కి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

by GSrikanth |

రాష్ట్రంలో తాగునీటి వసతి లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, యుద్ధ ప్రాతిపదికన అక్కడ సౌకర్యాన్ని కల్పించాలని పంచాయతీరాజ్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఆ బాధ్యత గ్రామ పంచాయతీలదే.. నొక్కి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తాగునీటి వసతి లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, యుద్ధ ప్రాతిపదికన అక్కడ సౌకర్యాన్ని కల్పించాలని పంచాయతీరాజ్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ. 10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. తాగునీటిని అందించే బాధ్యతను సర్పంచ్‌లే తీసుకోవాలని, ప్రస్తుతం వారి పదవీకాలం ముగుస్తున్నందున పంచాయతీరాజ్ శాఖ అధికారులే దాన్ని పట్టించుకోవాలన్నారు. గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు దాన్ని నిర్వహించే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని నొక్కిచెప్పారు. ఆ డిపార్టుమెంటుపై సచివాలయంలో మంగళవారం జరిగిన రివ్యూ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మిషన్ భగీరథ స్కీమ్‌లో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్స్, ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ బాధ్యతలను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదని, గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలోనూ లేకుండాపోయిందని అధికారులు వివరించడంతో జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు. రానున్న వేసవిలో గ్రామాల్లో మంచి నీటికి ఇబ్బందుల్లేకుండా ఇప్పటినుంచే అన్ని చర్యలూ చేపట్టాలని ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకు అందించేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలన్నారు. దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని సూచించారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ బాధ్యతలను సర్పంచ్‌లకే అప్పగించాలన్నారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. ఈ కారణంగానే కేంద్రం నుంచి జల జీవన్ మిషన్ స్కీమ్ ద్వారా నిధులు రావాల్సి ఉన్నా అందకుండా పోయాయన్నారు. వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికైనా జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు.

రాష్ట్రంలో చాలాచోట్ల తాగునీటి కోసం ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని, తండాలు, గూడేలు, అటవీ గ్రామాలకు నీళ్లు అందడంలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖానాపూర్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు తాగునీటికి పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారని గుర్తుచేశారు. రానున్న వేసవిలో తాగునీటికి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గోదావరి, కృష్ణా నదులపైనే ఆధారపడకుండా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నీటి సరఫరా సులువవుతుందని, తక్కువ ఖర్చుతోనే అందించవచ్చన్నారు. దీని కోసం కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయాలన్నారు.

రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని ఆవాసాలకు తాగునీరు అందడంలేదో సమగ్రంగా సర్వే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతున్నందున అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని నొక్కిచెప్పారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకూ వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని హాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

గ్రామాలకు త్వరలో రోడ్డు సౌకర్యం :

రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు, ఆవాసాలకు కొత్తగా రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు తేలిన లెక్క ప్రకారం 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించారు. వెంటనే వీటన్నింటికీ తారు రోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి పూర్తి చేయాలన్నారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత :

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా చేయాతనందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Next Story