బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత KCR కీలక పిలుపు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి భాగస్వామ్యం ఉందని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత KCR కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి భాగస్వామ్యం ఉందని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27తో 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని, అందుకు త్వరలోనే కమిటీలను వేస్తామని చెప్పారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తిప్పి కొడుతూ.. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సభను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణకు బీఆర్ఎస్ రక్షణ కవచం

బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రక్షణ కవచం అని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుండీ కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని చెప్పారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి ఈ విషయం స్పష్టమైందని.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దశాబ్దాలపాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్లపాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలన పరంగా దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి గోస పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు.

యువత, మహిళా భాగస్వామ్యం..

కాగా.. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీల్లోనూ వారికి ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే.. రాష్ట్రంతోపాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిగింది. గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా తెలంగాణ సమాజానికి మొదటినుంచీ వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సమావేశం భావించింది. బీఆర్ఎస్ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతున్నదనే అంశంపైనా చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థం అయ్యేలా వివరించి.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిథ్యం ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా చైతన్యం పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా పలు అంశాలపై చర్చ సందర్భంగా అధినేత కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన సుదీర్ఘ చర్చ సాగింది.

Next Story