- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండెక్కిన కోడి.. యుద్ధ ప్రభావంతో విచిత్ర పరిస్థితి
ఇరాన్ యుద్ధ ప్రభావం చికెన్ రేట్లపై పడింది. చికెన్ కు గిరాకీ ఏర్పడడటంతో ధర అమాంతం పెరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చికెన్‌ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు నాన్‌వెజ్ తినేందుకు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ఎండలతో దిగుమతి తగ్గడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. హైదరాబాద్‌లో డ్రెస్డ్ చికెన్ ధర కిలో రూ.300 చేరగా, ఇక స్కిన్‌లెస్ చికెన్ ధర 350 వరకు పెరిగింది. ఇక నాటు కోడి అయితే కిలోకు రూ.750 నుంచి రూ.800 మధ్య పలుకుతోంది. దీంతో జనం నాన్‌వెజ్‌వైపు చూడాలంటేనే జంకుతున్నారు. ఒకవైపు ఇరాన్ యుద్ధంతో గ్యాస్ ధరలు పెరగడం, నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరగగా తాజాగా చికెన్ ధరకు రెక్కలు రావడంతో ‘ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు..’ అంటూ వాపోతున్నారు. వేసవి కాలం ప్రారంభం కావడం, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ఎండలు ముదురుతుండటంతో పలు చోట్ల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో దిగుమతి ఘననీయంగా పడిపోయింది. దిగుమతి లేకపోవడంతో గడిచిన నాలుగు రోజులుగా చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. ఎండ వేడికి పలు కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతుండటంతో అవసరమైన మేరకు కోళ్ల దిగుమతి లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే చికెన్ ధర రూ.325కి పెరగడం ఇదే మొదటిసారని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో సరఫరా తగ్గడంతో రూ. 400 చేరవచ్చని మార్కెట్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నగరంలో చికెన్‌దుకాణాల వద్ద బారులు
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజూ సుమారు 10 నుంచి 15 వేల టన్నుల చికెన్‌ను విక్రయిస్తుంటారు. ఇక దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగల సమయాల్లో రోజుకు 15 నుంచి 20 వేల టన్నుల వరకు చికెన్ అమ్మకం జరుగుతుంది. నగర శివారు ప్రాంతాలైన చౌటుప్పల్, పటాన్‌చెరు, శంషాబాద్, షాద్‌నగర్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల నుంచి పెద్ద ఎత్తున నగరంలోని హోల్‌సేల్ చికెన్ మార్కెట్లతో పాటు చిన్నపెద్దా చికెన్ షాపులకు కోళ్లను సరఫరా చేస్తుంటారు. కొంతకాలంగా ఏపీలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో అక్కడి వ్యాపారులు కొందరు కోళ్లను మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుక్కొని వెళ్తుండటంతో హైదరాబాద్‌లో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎండలతో కోళ్లు చనిపోవడం కూడా ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
వారం రోజులుగా తగ్గిన గుడ్ల ధరలు
చికెన్ ధరలు పెరిగినప్పుడు గుడ్ల ధరలు సైతం పెరుగుతుంటాయి. కానీ ఈసారి గత పరిస్థితులకు భిన్నంగా చికెన్ ధరలు పెరుగుతుండగా గుడ్ల ధరలు మాత్రం పడిపోతున్నాయి. 30 గుడ్ల ట్రే ధర రూ.130 నుంచి రూ.140 మధ్య పలుకుతోంది. 12 గుడ్ల రిటైల్ ధర రూ.60గా ఉంది. ఇరాన్-ఇజ్రాయోల్ మధ్య యుద్ధ ప్రభావంతో ఇండియా నుంచి విదేశాలకు గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇండియాలో నిల్వలు ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. ఇది సామాన్యులకు ఊరట కలిగించే విషయం. మొన్నటివరకు ఒక్కో గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 వరకు పలకగా యుద్ధం కారణంగా రూ.4కే వస్తోంది. నెల రోజుల కితం బర్డ్‌ఫ్లూతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం మొదలవ్వడం, ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకోవడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉత్పత్తి తగ్గిపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరికొంతకాలం పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని పాల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫామ్స్‌లో కోళ్ల ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయి.
మరికొందరు చేపలు తినేందుకు మొగ్గు
ఇక ప్రస్తుతం చేపల సీజన్ నడుస్తుండంతో చికెన్ తినడం మానేసి చాలామంది చేపలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చేపల దిగుమతి ఘననీయంగా పెరగడంతో ఎక్కడ చూసినా చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో నాన్‌వెజ్ ప్రియులు చేపలవైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్‌తో పోలిస్తే చేపల ధర కిలోకు కేవలం రూ.150 నుంచి రూ.300 వరకు మాత్రమే ఉండటంతో చేపల కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు ఘననీయంగా పడిపోయాయి.






