TG: రాష్ట్రంలో భూమి విలువకు కొత్త బెంచ్‌మార్క్.. ‘రియల్’ రంగంపై బీఆర్ఎస్ విమర్శలకు చెక్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌లో రికార్డులు బద్దలయ్యాయి.

TG: రాష్ట్రంలో భూమి విలువకు కొత్త బెంచ్‌మార్క్.. ‘రియల్’ రంగంపై బీఆర్ఎస్ విమర్శలకు చెక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌లో రికార్డులు బద్దలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన తాజా వేలంలో హైదరాబాద్‌లోని రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ వద్ద గల 7.67 ఎకరాల భూమికి ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.177 కోట్ల ధర పలికింది. దీని ద్వారా రాష్ట్రంలో భూమి విలువకు కొత్త బెంచ్‌మార్క్ ఏర్పడింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం వచ్చింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలం పాటలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, ఎంఎస్ఎన్ రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1,356 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని ప్రచారం చేసింది. కానీ.. తాజా ధరలతో రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో ఉందో నిరూపితం అయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పడినట్లయింది. ఏకంగా ఎకరా ధర రూ.177 కోట్లు పలకడం బహుషా సౌత్ ఇండియాలోనే ప్రథమం అన్న టాక్ నడుస్తున్నది. కాగా.. గతంలో కోకాపేటలో ఎకరా రూ.100.75 కోట్లు పలుకగా.. ఇప్పుడు ఆ రికార్డు బద్దలయింది. ఈ వేలంపాటలో జాతీయ, ప్రాంతీయ స్థాయి డెవలపర్‌ల నుంచి అసాధారణ ఆదరణ లభించింది. ఇది హైదరాబాద్ వృద్ధి, పారదర్శకమైన వేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు ఉన్న బలమైన నమ్మకాన్ని కలిగించనుంది. ఎకరాకు రూ.177 కోట్ల రికార్డు ధర పలకడం హైదరాబాద్ దీర్ఘకాలిక సామర్థ్యంపై పెట్టుబడిదారులు, డెవలపర్‌లు ఎంత నమ్మకంతో ఉన్నారో తెలియజేస్తున్నదని టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశాంక చెప్పారు. రాయదుర్గం ధర 2017 నాటి ధరతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు.


చింతల్‌లో చదరపు గజం రూ.1.14 లక్షలు

మరోవైపు.. చింతల్‌లో హౌసింగ్ బోర్డు ప్లాట్లకు సైతం ఊహించని ధర వచ్చింది. విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశారు. కుత్బుల్లాపూర్ పరిధి చింతల్‌లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర రూ.1,14,000 పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్‌ఐజీ ఓపెన్ ప్లాట్‌కు ఆఫ్ సెట్ ప్రైజ్‌గా రూ.80 వేలు నిర్ధారించగా.. బహిరంగ వేలంలో చ.గజం రూ.1.14 లక్షలకు కొనుగోలు చేసినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. హెచ్‌ఐజీలోనే మరో 389 చ.గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్‌కు చదరపు గజానికి లక్ష రూపాయల ధర పలికిందని ఆయన తెలిపారు. సోమవారం మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో చదరపు గజానికి సగటున రూ.91,947 ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. కేబీహెచ్‌బీ, గచ్చిబౌలి పరిసరాల్లోని భూములకే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలోనూ చదరపు గజం ధర రూ.లక్ష దాటడం విశేషం. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నివాస భూములకు మంచి డిమాండ్ ఉందనడానికి ఇది నిదర్శనమని రియల్ వ్యాపారులు అంటున్నారు.

Next Story