- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నులిపురుగులకు చెక్.. 1-19 ఏళ్ల వారందరికీ తప్పనిసరి ఆల్బెండజోల్ : మంత్రి కీలక హెచ్చరిక
పిల్లల్లో నులిపురుగులు (నట్టలు) చేరితే అవి కంటికి కనిపించకుండానే వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయని, మాత్రలు వేయించకపోతే రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపంతో పాటు ఎదుగుదల పూర్తిగా మందగిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పిల్లల్లో నులిపురుగులు (నట్టలు) చేరితే అవి కంటికి కనిపించకుండానే వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయని, మాత్రలు వేయించకపోతే రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపంతో పాటు ఎదుగుదల పూర్తిగా మందగిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఈ సమస్యల కారణంగా చిన్నారుల్లో ఏకాగ్రత దెబ్బతిని చదువుపై శ్రద్ధ తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న ప్రతి ఒక్కరికీ ఆల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి స్వయంగా విద్యార్థులకు మాత్రలు వేసి ప్రారంభించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఈ మాత్రలను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు.
మాత్రలతో పెరగనున్న రోగనిరోధక శక్తి..
ఆల్బెండజోల్ మాత్రలు వేయడం వల్ల పిల్లల్లో నులిపురుగుల సమస్య పూర్తిగా తొలగిపోతుందని, వారు తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అబ్బి ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పాఠశాలల్లో నేర్చుకునే సామర్థ్యం, ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తల్లిదండ్రులందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కేవలం మాత్రలు వేయడమే కాకుండా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, రక్షిత తాగునీరు తాగడం, పండ్లు, కూరగాయలను కడిగి తినడం వంటి మంచి అలవాట్లను అలవర్చాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.
సోమవారం బడికి రాకపోవడం వల్లనో లేదా ఇతర కారణాల చేతనో మాత్ర వేయించుకో లేకపోయిన పిల్లల కోసం జూలై 20వ తేదీన ప్రత్యేకంగా మాప్-అప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆ రోజు విడిచిపెట్టిన విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






