- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. మూడు కార్పొరేషన్లు-ఒకే సెటప్!
తెలంగాణ కోర్ అర్బర్ రీజియన్ (టీసీయూఆర్)పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బర్ రీజియన్ (టీసీయూఆర్)పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రీజియన్ పరిధిలో ఒక్కో శాఖ స్వరూపం ఒక్కో విధంగా ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, పోలీసు, జలమండలి, టీజీ ఎస్పీడీసీఎల్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖలకు వేర్వేరు సెటప్‌లు ఉన్నాయి. వీటన్నింటిని సమన్వయం చేయడం సమస్యగా మారింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల ఆర్గనైజేషనల్ సెటప్ ఒకేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. దీని ఆధారంగానే మూడు పోలీసు కమిషనరేట్లలో మార్పులు చేశారు. భవిష్యత్‌లో జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూశాఖల్లో సైతం మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
జీహెచ్ఎంసీని మూడు భాగాలు
జీహెచ్ఎంసీలోని 150 వార్డులతో పాటు 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపి 300 వార్డులుగా పునర్విభజించారు. అయితే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా చేయనున్నారు. 146 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), 74 వార్డులతో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎస్ఎంసీ), ఇంకో 80 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీసీఎంసీ)గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10న ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
కార్పొరేషన్ జోన్లు సర్కిళ్లు వార్డులు..
| కార్పొరేషన్ | జోన్లు | సర్కిళ్లు | వార్డులు |
| జీహెచ్ఎంసీ (GHMC) | 6 | 30 | 146 |
| జీసీఎంసీ (GCMC) | 3 | 16 | 80 |
| జీఎంఎంసీ (GMMC) | 3 | 14 | 74 |
| మొత్తం | 12 | 60 | 300|
జలమండలిని సైతం
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)ను ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా చేసినట్టుగానే జలమండలి పరిధిని సైతం మూడు బోర్డులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం జలమండలి సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ వారీగా పనిచేస్తున్నారు. వీటిలో ఆపరేషన్, మెయింటెన్స్ (ఓఅండ్ఎం) సర్కిళ్లు 5 ఉన్నాయి. డివిజన్లు 22, సబ్ డివిజన్లు 68, సెక్షన్లు 192 ఉన్నాయి. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ప్రస్తుతం జలమండలి నిర్మాణం పూర్తిగా మారనుంది. మున్సిపల్ కార్పొరేషన్‌లోని జోన్‌ను జలమండలి సర్కిల్ గాను, సర్కిల్.. జలమండలి సబ్ డివిజన్, వార్డును సెక్షన్‌ను మార్చనున్నారు. దీంతో జలమండలి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ 12 సర్కిళ్లుగాను, 60 సబ్ డివిజన్లుగాను, 300 సెక్షన్లుగాను మారనుంది. డివిజన్ ఏరియాను ఎత్తి వేయనున్నారు.
కార్పొరేషన్ సర్కిళ్లు సబ్ డివిజన్లు సెక్షన్లు
| కార్పొరేషన్ | సర్కిళ్లు | సబ్ డివిజన్లు | సెక్షన్లు |
| జీహెచ్ఎంసీ | 6 | 30 | 146 |
| జీసీఎంసీ | 3 | 16 | 80 |
| జీఎంఎంసీ | 3 | 14 | 74 |
| మొత్తం | 12 | 60 | 300 |
టీజీఎస్పీడీసీఎల్ ఇలా..
మున్సిపల్ కార్పొరేషన్ల ఆధారంగానే డిస్కంలో సైతం మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీఎస్పీడీసీఎల్‌లోని డైరెక్టర్(ఆపరేషన్స్)లో మెట్రోజోన్, రంగారెడ్డి జోన్లు ఉన్నాయి. మెట్రో జోన్ పరిధిలో బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిళ్లు ఉన్నాయి. రంగారెడ్డి జోన్ పరిధిలో వికారాబాద్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్ నగర్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో డివిజన్లు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసినట్టుగానే టీజీఎస్పీడీసీఎల్‌ను సైతం మూడు ముక్కలు చేయనున్నారు. ఆయా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేలా మార్చనున్నారు. మూడు కార్పొరేషన్లకు గాను మూడు డైరెక్టరేట్ లను ఏర్పాటు చేయనున్నారు. అంటే జీహెచ్ఎంసీ జోన్, సర్కిల్, వార్డు ఆధారంగానే టీజీ ఎస్పీడీసీఎల్ నిర్మాణంలో మార్పులు చేయనున్నారు.
కమర్షియల్ ట్యాక్స్ శాఖలో..
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కమర్షియల్ ట్యాక్స్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఈ శాఖలో సైతం సమూలంగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాఖలో 14 డివిజన్లు ఉంటే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో బేగంపేట్, చార్మినార్, హైదరాబాద్ రూరల్, మాదాపూర్, మల్కాజ్‌గిరి, పంజాగుట్ట, సరూర్ నగర్, సికింద్రాబాద్ మొత్తం 8 డివిజన్లు ఉన్నాయి. వీటిని సైతం మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం ఆధారంగానే మార్చనున్నారు. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రెవెన్యూ శాఖను సైతం
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆర్థికాభివృద్ధి పెంచాలనే ఉద్దేశంతో అన్ని శాఖల నిర్మాణం ఒకేరకంగా ఉండాలని సీఎం పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రెవెన్యూ శాఖను సైతం మున్సిపల్ కార్పొరేషన్ల ఆధారంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో 6 జోన్లలో హైదరాబాద్, కంటోన్మెంట్, రంగారెడ్డి జిల్లా ప్రాంతం కలిసింది. ఇక్కడ రెండు వేర్వేరుగా ఉండడంతో రెవెన్యూ, మున్సిపల్ శాఖలను సమన్వయంగా ఇబ్బందిగా మారింది. అందుకే జీహెచ్ఎంసీ ఏరియాను హైదరాబాద్ జిల్లాగా మార్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ) ఏరియాలో సైతం రంగారెడ్డి జిల్లాకు చెందిన శేరిలింగంపల్లి జోన్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉన్నాయి. ఈ ఏరియా ఒక జిల్లాగా చేయాలనే చర్చ జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(జీఎంఎంసీ) పరిధిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎల్బీనగర్ జోన్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఉప్పల్, మల్కాజ్‌గిరి జోన్లు ఉన్నాయి. ఈ మూడు జోన్లను కలిపి ఒక జిల్లా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్). గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ), గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(జీఎంఎంసీ) మూడు నగరాలతోపాటు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఫ్యూచర్ సిటీ ఏరియాను ప్రత్యేక జిల్లాగా మార్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.






