- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా మా లక్ష్యం
రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, ఇల్లెందు : రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఇల్లెందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కామేపల్లి మండలం మద్దులపల్లి, ఇల్లెందు మండలం రొంపేడు, టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు వద్ద 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కామేపల్లి మండలంలో పెద్ద చెరువు అభివృద్ధి పనులు, పలు బీటీ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు రైతులకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 16 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం..
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోందని, గత కొద్ది కాలంలోనే సుమారు 5 వేల మెగావాట్ల డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రాష్ట్రానికి 16 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడిందని డిప్యూటీ సీఎం తెలిపారు. అయినప్పటికీ వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 160 అత్యవసర వాహనాలు..
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించేందుకు 160 ప్రత్యేక అత్యవసర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డివిజన్ వారీగా వీటిని ఏర్పాటు చేశామని, విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు 1912 టోల్‌ఫ్రీ నంబర్కు సమాచారం ఇస్తే అవసరమైన పరికరాలతో సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తారని వివరించారు.
పోడు సాగుదారులకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’..
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉన్న ఏజెన్సీ ప్రాంత గిరిజన పోడు సాగుదారుల కోసం ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులతో **‘ఇందిరా సౌర గిరి జల వికాసం’** పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద బోర్‌వెల్లు, పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందజేస్తామని, దీనివల్ల గిరిజన రైతుల ఆత్మగౌరవం, ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.
సింగరేణి భవిష్యత్తుకు ప్రత్యేక ప్రణాళికలు..
సింగరేణి సంస్థ ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం కొత్త బ్లాకుల సాధనలో చొరవ చూపకపోవడంతో సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. తాడిచెర్ల బ్లాక్‌ను సింగరేణికి దక్కేలా కేంద్రంతో చర్చలు జరిపి ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్‌మిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, జిల్లా కలెక్టర్ అంకిత్, టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్ & ఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ తాటిపాముల సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






