FSL: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం.. అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్

by Prasad Jukanti |   (  Updated:2026-02-08 10:10:51  IST  )

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం రాజకీయ వివాదానికి దారి తీసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.

FSL:  ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం.. అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం ఘటన చుట్టూ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అత్యంత కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్ ఆధారాలు ఉండే ల్యాబ్ లో మంటలు చెలరేగడం పట్ల విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక ఆధారాలను కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డ కౌంటర్ ఇచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం ఉంది ఏమోనని నాకు అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోరెన్సింక్ ల్యాబ్‍లో ఫోన్ ట్యాపింగ్ టేపులు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలు ఉన్నాయని అందుకే కేటీఆర్ ముందే వచ్చి రేవంత్ రెడ్డిపై అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డికి ముడిపెట్టే ప్రయత్నం:

మీ చరిత్ర గతంలో తెలంగాణ ప్రజలు చూశారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఎస్ఐబీఆఫీస్‍లో సీసీ కెమెరాలు బంద్ చేసి ఇజ్రాయిల్ నుంచి తెచ్చిన పరికరాలు, ఫైల్స్ మొత్తం ధ్వంసం చేసి మూసీ నదిలో పారేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ కుటుంబం విచారణ ఎదుర్కొంటుందని అందువల్ల ఫోరెన్సిక్ ల్యాబ్ వెనుక కుట్ర ఉంటే అది కేటీఆర్ వైపు నుంచే ఉంటుందని ఆరోపించారు. కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. ఫోరెన్సిక్ ల్యాబ్‍లో అగ్నిప్రమాదం జరిగితే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేసుకు ముడిపెట్టి కేటీఆర్ మాట్లాడారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వీపు చింతపండు చేస్తారని కేటీఆర్‍కు అర్ధం అయిందని అందుకే రేవంత్ రెడ్డిపై విష ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని కేటీఆర్ చిల్లర ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరాలి:

బావ బావమరిది ఇద్దరూ కలిసి పొద్దున ఒకరు, మధ్యాహ్నం మరొకరు, సాయంత్రం ఒకరు ప్రెస్ మీట్, ట్విట్టర్, చిట్ ఛాట్ పేరుతో ప్రజలను చీట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి టీఆర్ఎస్‍ను బీఆర్ఎస్ చేశారని తెలంగాణ ప్రజలను కేటీఆర్ కుటుంబం క్షమాపణలు కోరాలన్నారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడగడానికి మీకు సిగ్గు, శరం ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ కే ఓటు వేయండి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Next Story