- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొత్త కోర్సులు, పాత సమస్యలు: ఉన్నత విద్యలో సవాళ్లు

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే కొత్త కోర్సులు, టెక్నికల్ స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెబుతోంది. మారుతున్న కాలానికనుగుణంగా, ఉద్యోగ అవకాశాలు పెంపొందించేలా కొత్త సిలబస్ తీసుకొస్తున్నామని ప్రకటించింది. కానీ కొత్త సిలబస్, టెక్నికల్ అంశాలపై దృష్టి సారించిన అధికారులు వాటి ఆచరణపై దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలోని 28 ప్రభుత్వ కాలేజీల్లో అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం (ఏఈడీపీ) పేరిట కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. రెండేళ్ల క్రితం ఇలాంటి కోర్సులను కొన్ని ప్రముఖ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది మరిన్ని కళాశాలల్లో విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కోర్సులు ప్రవేశ పెట్టే ముందు పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే బాగుంటుందని లెక్చరర్లు అభిప్రాయపడుతున్నారు.
సిబ్బంది, ల్యాబ్ సదుపాయం కరువు
బీకాం (బీఎఫ్ఎస్ఐ), ఈ కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, బీఎస్సీ డిజిటల్, ఇండస్ట్రీయల్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్స్, బీఎస్సీ ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీబీఏ ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కోర్సులను కొత్తగా అందుబులోకి తేనున్నారు. అయితే ఈ కోర్సులు బోధించే సిబ్బంది ఎంత వరకు ఉన్నారు..? ల్యాబ్‌ల సదుపాయం ఎంత వరకు ఉంది? అనే విషయాలను ఉన్నత విద్యా మండలి అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని అధ్యాపకులు అంటున్నారు. నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు పెంపొందించడమే కొత్త కోర్సుల లక్ష్యం అయినా.. కాలేజీల్లో పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు స్టూడెంట్స్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత స్కిల్స్ లేక మార్కెట్లో ఉద్యోగాలు పొందడంలో విఫలం అవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కోర్సుల్లో చేరిన వారు సాయంత్రం, వీకెండ్లలో ఆయా రంగాలకు సంబంధించిన స్టోర్స్‌లో, ఆఫీసుల్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ప్రతి నెలా రూ.10 వేల వరకు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ అకడమిక్స్‌లో వీక్‌గా ఉంటున్నారనే వాదన వినిపిస్తోంది. మరో వైపు ఈ ఏడాది ప్రతి సెమిస్టర్‌లోనూ ఓ టెక్నాలజీ సబ్జెక్టును ప్రవేశ పెట్టనున్నారు. ఇంగ్లీష్‌లోనూ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచేలా మార్పులు చేస్తున్నారు. అయితే ఆయా కోర్సులను ప్రవేశ పెట్టేటప్పుడు వాటిని బోధించే ఫ్యాకల్టీ ఉన్నారా? జాబ్ మార్కెట్ ఉందా? కాలేజీల్లో మౌలిక వసతులు ఉన్నాయా? ఫ్యాకల్టీ అప్ డేట్ అవుతున్నారా? వంటి విషయాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొత్త కోర్సులు, టెక్నికల్ అంశాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాల్సి ఉంది.