తెలంగాణలో ‘చాలెంజ్’ల రాజకీయం .. ప్రధాన పార్టీల మధ్య హీటెక్కుతున్న డైలాగ్ వార్స్

by Prasad Jukanti |   (  Updated:2026-05-31 12:07:38  IST  )

రాష్ట్రంలో హీటెక్కిన పొలిటికల్ డైలాగ్ వార్. గురుకులాలపై కేటీఆర్‌కు అడ్లూరి, ఖమ్మంలో బీజేపీ గెలుపుపై కూనంనేని ఓపెన్ ఛాలెంజ్.

తెలంగాణలో ‘చాలెంజ్’ల రాజకీయం ..  ప్రధాన పార్టీల మధ్య హీటెక్కుతున్న డైలాగ్ వార్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది. ప్రధాన పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మండుటెండల్లో పొలిటికల్ హీటెక్కిస్తోంది. నువ్వొకటంటే నేను రెండు అని చూపిస్తా?, నువ్వు సవాల్ చేస్తే నేనూ సవాల్ చేస్తా అంటూ నేతల మధ్య మాటల యుద్ధం స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. నిన్నా మొన్నటి వరకు చర్చకు సిద్ధం వరకే పరిమితమైన చాలెంజ్‍లు ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీకీ నుంచి తప్పుకోవడం వరకు చేరాయి. ఒకరిపై మరొకరు బహిరంగ సవాళ్లు విసురుకుంటూన్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో అనే చర్చ ఆసక్తిగా మారింది.

కాకరేపుతున్న సీఎం చాలెంజ్:

రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు సంచలన సవాల్ విసిరారు. వ్యవసాయ మోటర్లకు వీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేమం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని మరి పట్టకుంటే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. స్వయంగా సీఎం విసిరిన సవాలుపై ఇవాళ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ ముఖ్యమంత్రికి కౌంటర్ చాలెంజ్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయగలరా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో 8 గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని తెలంగాణలోనూ అదే పరిస్థితి రాబోతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ వర్సెస్ పొంగులేటి:

సీఎం చాలెంజ్ ఇలా ఉంటే మరో వైపు అధికార ప్రతిపక్ష నేతలు మధ్య మాటల ఫిరంగులు పేలుతూనే ఉన్నాయి. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం షురూ అయింది. ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప కట్టుడు లేదని, హైదరాబాద్‍లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు అయినా కట్టిండ్రా అని నిలదీసినా నిలదీశారు. ఈ వ్యాఖ్యలకు స్పందిచిన మంత్రి పొంగులేటి కేటీఆర్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ మాదిరిగా మేము కాదని మీకంటే ఎక్కువ ఇండ్లు కడినేతే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని లేదంటే పోటీకి దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. అంతే కాదు ఇందిరమ్మ ఇండ్లే మా పాలనకు రెఫరెండం అంటూ ఘాటు కౌంటర్లు కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త గురుకుల భవనమైనా నిర్మించారా? అలా నిర్మించినట్లు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటూ కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ సవాల్ విసిరారు.

ఖమ్మం కోటపై కూనంనేని:

ఇక కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన ఖమ్మం జిల్లా రాజకీయం కూడా హీటెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బీజేపీని లక్ష్యంగా చేసుకుని సంచలన సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ కనీసం ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అక్కడ మతతత్వ శక్తులకు తావులేదని స్పష్టం చేశారు.

సవాళ్లకే పరిమితమా ఆచరణలోకి కూడానా?:

మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. నువ్వా నేనా అన్నట్లు సవాళ్ల వరకు చేరుకుంది. మరిఅంతిమంగా నేతలు తాము చేస్తున్న చాలెంజ్‍లపై నిలబడతారా లేక అంతా తూచ్ అంటూ ప్రజలకు ఎగనామం పెడతారా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Next Story