రైల్వే రంగంలో తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యత: ఎంపీ లక్ష్మణ్

by Malleboina Mahesh |

తెలంగాణ మౌలిక రంగానికి కేంద్రం రూ.1.20 లక్షల కోట్లు కేటాయించింది.. రైల్వే కారిడార్లు, రహదారులతో రాష్ట్ర ప్రగతికి పెద్దపీట వేసిందన్న ఎంపీ లక్ష్మణ్!

రైల్వే రంగంలో తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యత: ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అనేక దశాబ్దాల కాలంలో సుమారు 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి కాగా, గత 12 ఏళ్లలోనే మరో 5 వేల కిలోమీటర్లను రూ.1.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసినట్లు రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ తెలిపారు. రైల్వే రంగంలో తెలంగాణకు కేంద్రం విశేష ప్రాధాన్యం కల్పించిందని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం, కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు, మెదక్, సిద్దిపేట, కొమురవెల్లి ప్రాంతాలకు రైల్వే అనుసంధాన విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు ఇచ్చిందన్నారు. శనివారం కవాడీగూడ పీఐబీలో నిర్వహించిన వార్త మీడియా ఇంటరాక్షన్​కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టిన తరువాత దేశం సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారతలో చరిత్రాత్మక పురోగతిని సాధించిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం స్వనిధి, పీఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జనధన్ యోజన వంటి పథకాలు దేశంలోని పేదలు, మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయని అన్నారు.

ఉజ్వల పథకం ద్వారా 11 కోట్లకు పైగా మహిళలు ప్రయోజనం పొందారని, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి రావడంతో మహిళల ఆత్మగౌరవం, భద్రత మరింత పెరిగిందని తెలిపారు. 81 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత కల్పించడం వంటి కార్యక్రమాలు ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా గత దశాబ్దంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, హైదరాబాద్‌ను బెంగళూరు, చెన్నై, పుణే నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైలు కారిడార్లను తాజాగా బ‌డ్జెట్‌లో ప్రక‌టించార‌ని గుర్తు చేశారు. మామునూర్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు.

అనంతరం సీనియర్ జర్నలిస్టు కస్తూరి రాకా సుధాకర్ రావు వివరిస్తూ సమర్థవంతమైన సమాచార ప్రసారం, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం మంచి పాలనకు కీలకమని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ప్రభుత్వాలపై విశ్వాసాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. పీఐబీ అడిష‌న‌ల్ డైరెక్టర్ జ‌న‌ర‌ల్‌ శృతి పాటిల్ ప్రసంగిస్తూ ద్వితీయ‌, తృతీయ శ్రేణి నగరాల వారికి అవ‌గాహ‌న‌, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు, సామర్థ్యాభివృద్ధికి ఈ కార్యశాల ఉప‌యోగ‌ప‌డుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు, వాటి ప్రభావంపై అర్థవంతమైన చర్చలకు ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు.

Next Story