కేంద్రానివి ‘రైతు వ్యతిరేక’ విధానాలు.. మంత్రి తుమ్మల ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-18 14:32:10  IST  )

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో విఫలమయ్యాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

కేంద్రానివి ‘రైతు వ్యతిరేక’ విధానాలు.. మంత్రి తుమ్మల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై అవలంబిస్తున్న విధానాలు రైతులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం సమగ్ర వ్యూహంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పదేపదే "కేంద్రమే ధాన్యమంతా సేకరిస్తోంది, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది" అని ప్రచారం చేయడం వాస్తవ పరిస్థితులను వక్రీకరించడమేనని మండిపడ్డారు. రైతుల సమస్యలను ఒక్క వరి ధాన్యానికి మాత్రమే పరిమితం చేయడం సరైంది కాదని.. వరితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు, పెసలు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పత్తి, ఆయిల్‌పామ్ వంటి అనేక పంటలు రాష్ట్రంలో విస్తృతంగా సాగవుతున్నాయని తెలిపారు. ఈ పంటల కొనుగోళ్లు, మద్దతు ధరలు, దిగుమతి-ఎగుమతి విధానాలు, ఎరువుల ధరలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు.

వరి ధాన్యం విషయంలో కూడా ఎఫ్‌సీఐ (FCI) పూర్తి పంటను కొనుగోలు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం వరి ధాన్యానికి క్వింటాకు రూ. 2,300 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు. రైతులకు నిజమైన భరోసా కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

కేంద్రం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న పెసలు, కందులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటలపై 25 శాతం పరిమితి విధించడంతో, మిగిలిన 75 శాతం పంటను రైతులు ఎక్కడ విక్రయించాలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వం 'ధర మద్దతు పథకం' పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదో స్పష్టం చేయాలన్నారు. ఇది రైతుల పట్ల కేంద్రానికి ఉన్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ఆ ధరకు ప్రభుత్వ కొనుగోలు గ్యారెంటీ లేకపోవడంతో రైతులు దళారుల చేతిలో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలకు మద్దతు ధరల నిర్ణయంలో పారదర్శకత లేదు..

కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు (MSP) స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ2 + 50 శాతం సూత్రాన్ని అనుసరిస్తున్నాయో లేదో రైతులకు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో ఎరువులు, డీజిల్, విత్తనాలు, కూలీల ఖర్చులు భారీగా పెరిగినా, ఆ స్థాయిలో మద్దతు ధరలు పెరగలేదన్నారు.గత ఐదేళ్లలో డీఏపీ (DAP) ధరలు 70 శాతం, కాంప్లెక్స్ ఎరువులు 60 శాతం, డీజిల్ ధరలు 40 శాతం, వ్యవసాయ కూలీల ఖర్చులు 100 శాతం వరకు పెరిగాయని గుర్తుచేశారు. కానీ మద్దతు ధరల పెరుగుదల మాత్రం వరిపై 27 శాతం, గోధుమపై 26 శాతం, మొక్కజొన్నపై 20 శాతం, జొన్నపై 41 శాతం, పత్తిపై 40 శాతం మాత్రమే ఉండటం రైతులకు ఏమాత్రం న్యాయం చేకూర్చదన్నారు. ఈ స్వల్ప పెరుగుదలలు రైతుల అసలు సాగు వ్యయాలకు కూడా సరిపోవడం లేదన్నారు.

Next Story